“ఆహా” నిర్వాహకులు ఏ ముహూర్తాన అన్‌స్టాపబుల్ సెకెండ్ సీజన్ షూటింగ్ స్టార్ట్ చేశారో తెలియదు కానీ, ఫస్ట్ ఎపిసోడే విమర్శలకు గురైంది. ఇది ఎంటర్టైన్మెంట్ కార్యక్రమమా లేక బావాబామ్మర్దుల సొంత డబ్బానా? అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. మరీ ముఖ్యంగా 1995లో దివంగత ఎన్టీఆర్‌ను గద్దె దించే ఎపిసోడ్‌ను బావాబామ్మర్దులు సమర్థించుకోవడంపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ సాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే…. అన్ స్టాపబుల్ పై నాన్ స్టాప్ ట్రోలింగ్ అన్నమాట.
గీతారెడ్డి అనే మహిళా తన ఫేస్బుక్ ఖాతాలో చంద్రబాబు, నందమూరి బాలకృష్ణలను పౌరాణిక పాత్రలతో పోల్చి ఉతికి ఆరేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడాన్ని, కురు సభలో ద్రౌపదికి జరిగిన పరాభవంతో పోల్చి దెప్పిపొడిచారు. ఆమె పోస్టు ఏంటో తెలుసుకుందాం.
“కురు సభలో ద్రౌపదికి జరిగిన అవమానం గురించి .. దుర్యోధనుడు, దుశ్శాసనులిద్దరూ విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలి అని చెబితే ఎలా వుంటుంది? తండ్రిని చెరసాలలో వేయడంపై విచారణ బాధ్యతల్ని ఔరంగజేబుకే అప్పగిస్తే ఎలా వుంటుంది? అలా వుంది ఆ unstoppable (అబద్ధాలు) అనే ప్రోగ్రాం”
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో పోస్టు గురించి తెలుసుకుందాం.
“కాళ్లు పట్టుకొని ఎంత బతిమాలినా ఆయన నా మాట వినలేదు.. అందుకే 'దేశం' కోసం, ఆరోజు ఆ పని చేయక తప్పలేదు.—– గాడ్సే!”
అంటూ చంద్రబాబును ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నా వినలేదని చంద్రబాబు వివరణపై ఈ రకంగా ర్యాగింగ్ చేస్తున్నారు. అలాగే ఒక పొలిటికల్ యూట్యూబర్ ఎనలిస్ట్ విశ్లేసిస్తూ… బాలకృష్ణను చూస్తే నాకు జాలేసింది. ఇంత అమాయకమైన బామ్మర్ది దొరికితే బావలకు రామారావు అంతటి వాళ్లను కూల్చేయడం ఏం ఖర్మ, ఏమైనా చేయొచ్చని అదిరిపోయే పంచ్ విసిరారు.
ఇలా ప్రతి ఒక్కరూ బావాబామ్మర్దుల ఇంటర్వ్యూపై వ్యంగ్య ధోరణిలో తుంటర్వ్యూలు చేస్తుండడం గమనార్హం.