ఆ మాజీ మంత్రి వ్యవహార శైలితో జగన్ విసిగిపోతున్నారా?

ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకులు ఒక్క తీరుగా ఉండరు కదా. కొందరు అధినేతను సంతోషపెడితే, కొందరు చిరాకు కలిగిస్తుంటారు, విసుగు పుట్టిస్తుంటారు. ఇలాంటివారు చివరకు ఫలితం అనుభవిస్తారు. అంటే మంత్రి పదవి దక్కకపోవడమో, ఎన్నికల్లో…

ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకులు ఒక్క తీరుగా ఉండరు కదా. కొందరు అధినేతను సంతోషపెడితే, కొందరు చిరాకు కలిగిస్తుంటారు, విసుగు పుట్టిస్తుంటారు. ఇలాంటివారు చివరకు ఫలితం అనుభవిస్తారు. అంటే మంత్రి పదవి దక్కకపోవడమో, ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడమే జరుగుతుంది. కొందరు నాయకులు అధినేతకు విసుగు తెప్పించడానికి కారణం వారిలో పేరుకున్న అసంతృప్తే. వైసీపీలో సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి ఇలాంటి అసంతృప్తవాదుల్లో ఒకడు. 

ఆయన వ్యవహారశైలితో సీఎం, పార్టీ అధినేత జగన్ విసిగిపోతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కేది కూడా అనుమానమే అంటున్నారు కొందరు. సీనియర్ నేత, మాజీమంత్రి, వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి వ్యవహారం పార్టీలో పెద్ద తలనొప్పిగా తయారైంది. గతకాలపు తన వైభవాన్ని తలచుకుంటు ప్రస్తుతం తనను ఎవరు లెక్కచేయటం లేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారు. దాంతో అధికారులపైన, మంత్రులు, సహచర ఎంఎల్ఏలపై రెగ్యులర్ గా యేవో వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. తాను చేసే వ్యాఖ్యలు ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా చేటు తెస్తాయన్న విషయం బాగా తెలిసి కూడా తన పద్దతిని మార్చుకోవటంలేదు. 

అంటే ఏదోరకంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందిపెట్టడమే టార్గెట్ గా వ్యవహరిస్తున్నారని అర్ధమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రామనారాయణరెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఇదే పద్దతిలో ఉంటారు. ఎవరైనా సరే తన ఆధిపత్యాన్ని ఆమోదించాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ లో ఉన్న పదేళ్ళు మంత్రిగా బ్రహ్మాండంగా వెలిగారు. ఒక దశలో ముఖ్యమంత్రి అవుతాడని కూడా అనుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆనం తన ప్రాభవాన్ని కోల్పోయారు. అప్పటినుండి పూర్వవైభవాన్ని పొందేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అది కుదరకపోవటంతోనే నిత్యం అసంతృప్తిగా ఉంటున్నారు.

జగన్ కేబినెట్ లో చోటు దక్కుతుందని భావించినా అవకాశం రాలేదు. దీంతో ఆయన వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. కొంత కాలంగా ఓపెన్ గానే ఆనం తన అసమ్మతిని బయటపెడుతున్నారు. జగన్ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆనం కామెంట్లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. తాజాగా మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు నగరంలోని దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌ దగ్గర ఎమ్మెల్యే ఆనం హల్చల్ చేశారు. పోలీసులతో గొడవకు దిగారు.

స్థానిక వేణుగోపాలస్వామి ఆలయ భూముల్లో అక్రమాలు జరిగాయని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆలయ సిబ్బందిని పోలీసులు విచారణ కోసం పిలిచారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే ఆనం కోపంతో ఊగిపోయారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి తన ప్రతాపం చూపించారు. ఆలయ సిబ్బందిని పోలీస్ స్టేషన్ కు పిలవడంపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఏం విచారణ చేస్తున్నారని నిలదీశారు. ఎవరో ఫిర్యాదు చేసే నిజానిజాలు తెలుసుకోకుండానే విచారణ కోసం ఎలా పిలుస్తారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ తీరుపై ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పోలీసుల ముందే సీఐ పని తీరు బాగా లేదంటూ మండిపడ్డారు. ఇదేం పద్ధతంటూ ఉన్నతాధికారులను నిలదీశారు.

పోలీసులతో పాటు ప్రభుత్వం తీరుపైనా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఇలాంటి దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. భయపెట్టి భూములను ఆక్రమించుకోవడం, భవనాలను లాక్కోవడం కామన్ గా మారిపోయిందన్నారు ఆనం. ప్రజలే కళ్లు తెరిచి తిరగబడాలని పిలుపిచ్చారు. నెల్లూరులో జరిగే అక్రమాలు, దుర్మార్గాలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. పోలీసుల హామీతో ఈ గొడవను ఇంతటితో వదిలేస్తున్నామని చెప్పారు. అయితే పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే ఆనం చేసిన కామెంట్లు రచ్చగా మారాయి. ప్రజలే తిరగబడాలని చెప్పడం ద్వారా పరోక్షంగా సీఎం జగన్ పై తాను తిరుగబాటు చేశాననే సంకేతం ఆనం ఇచ్చారనే టాక్ నడుస్తోంది.గతంలోనూ పలు సార్లు జగన్ ను టార్గెట్ చేసేలా మాట్లాడారు ఆనం.

నెల్లూరులో జరిగిన ఘటన వైసీపీలో కలవరం రేపుతోంది. పార్టీలో కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి.. తన దారి చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చారనే ప్రచారం సాగుతోంది. 2014 ఎన్నికల తర్వాత ఆనం సోదరులు అంటే రామనారాయణరెడ్డితో పాటు వివేకానందరెడ్డి కూడా టీడీపీలో చేరారు. టీడీపీలో ఉన్నపుడు కూడా తన మాటే చెల్లుబాటు కావాలని చాలా ప్రయత్నాలే చేశారు. అది సాధ్యం కాకపోవటంతో అక్కడ ఇమడలేక వైసీపీలో చేరటానికి ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే సోదరుల వ్యవహారం అందరికీ తెలిసిందే కాబట్టి అప్పటి వైసీపీ ఎంఎల్ఏలు ఆనం సోదరులను పార్టీలో చేర్చుకోవటానికి ఇష్టపడలేదు.

తర్వాత వివేకానందరెడ్డి మరణించటంతో రామనారాయణరెడ్డి టీడీపీకి దూరంగా జరిగారు. పార్టీలో చేర్చుకునేంతవరకు బతిమలాడుకుని తీరా చేర్చుకుని, టికెట్ తీసుకుని గెలిచిన తర్వాత ఆనం వ్యవహారం పూర్తిగా మారిపోవటాన్ని జగన్ గమనిస్తున్నారట. అసలు ఆనంను పార్టీలో చేర్చుకున్నదే చాలా ఎక్కువ. అలాంటి ఆనం వ్యవహారశైలితో జగన్ కూడా బాగా విసిగిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవాలు గ్రహించి తన పద్దతిని మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఆనంకు టికెట్ అనుమానమే అంటున్నారు. మరి ఆనం ఏమి చేస్తారో చూడాల్సిందే.