బాబుకో న్యాయం? జూ.ఎన్టీఆర్‌కో న్యాయ‌మా?

దివంగ‌త వైఎస్సార్‌తో అనుబంధం ఉంద‌ని చెప్పిన చంద్ర‌బాబుకో న్యాయం? వైఎస్సార్ పేరు ప్ర‌స్తావించిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు మ‌రో న్యాయ‌మా? అనే ప్ర‌శ్న తెర‌పైకి వ‌చ్చింది. “అన్‌స్టాప‌బుల్” ఇంట‌ర్వ్యూలో హోస్ట్‌, బామ్మ‌ర్ది నంద‌మూరి బాల‌య్య స్నేహ…

దివంగ‌త వైఎస్సార్‌తో అనుబంధం ఉంద‌ని చెప్పిన చంద్ర‌బాబుకో న్యాయం? వైఎస్సార్ పేరు ప్ర‌స్తావించిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు మ‌రో న్యాయ‌మా? అనే ప్ర‌శ్న తెర‌పైకి వ‌చ్చింది. “అన్‌స్టాప‌బుల్” ఇంట‌ర్వ్యూలో హోస్ట్‌, బామ్మ‌ర్ది నంద‌మూరి బాల‌య్య స్నేహ సంబంధాల‌పై అడిగిన ప్ర‌శ్న‌కు చంద్ర‌బాబు స‌మాధానం ఇచ్చారు.

త‌న‌కు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మంచి మిత్రుడ‌ని చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. 1978-83 మ‌ధ్య కాంగ్రెస్‌లో క‌లిసి రాజ‌కీయ ప్ర‌యాణం సాగించిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. ఇద్ద‌రూ క‌లిసి బాగా తిరిగిన రోజుల్ని జ్ఞ‌ప్తికి తెచ్చుకున్నారు. తాను టీడీపీలో చేరిన త‌ర్వాత  రాజ‌కీయ శ‌త్రుత్వం ఏర్ప‌డిందే త‌ప్ప‌, వ్య‌క్తిగ‌త వైరం లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై ఎలాంటి వివాదం లేదు.

ఇదే వైఎస్సార్ పేరును జూనియ‌ర్ ఎన్టీఆర్ పాజిటివ్ కోణంతో ప్ర‌స్తావించ‌గా, లోకేశ్ నేతృత్వంలోని ఓ టీమ్ ట్రోలింగ్ చేసింది. వీటికి జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వ‌డంతో వెన‌క్కి త‌గ్గారు. హెల్త్ వ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొల‌గించి, వైఎస్సార్ పేరును ప్ర‌భుత్వం పెట్టింది. దీనిపై జూనియ‌ర్ ఎన్టీఆర్ పెద్ద‌రికంతో ఓ ట్వీట్ చేశారు.

“ ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా ఇంకొకరి స్థాయి తగ్గదు” అని  స్పందించ‌డ‌మే టీడీపీ దృష్టిలో జూనియ‌ర్‌ ఎన్టీఆర్ నేర‌స్తుడ‌య్యారు. ఎన్టీఆర్‌తో స‌మాన‌మైన స్థానాన్ని వైఎస్సార్‌కు ఎలా క‌ల్పిస్తావ‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను లోకేశ్ నేతృత్వంలోని టీమ్ ప్ర‌శ్నించింది.

తాజాగా వైఎస్సార్‌ను త‌న మిత్రుడిగా చంద్ర‌బాబు చెప్ప‌డంపై ఏమంటార‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు నిల‌దీస్తున్నారు. రాజ‌కీయంగా మీరెవ‌రితోనైనా సంబంధాలు పెట్టుకోవ‌చ్చ‌ని, ఇత‌రులెవ‌రైనా పేరు ప్ర‌స్తావించినా ద్రోహం అవుతుందా? అని జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు నిల‌దీస్తున్నారు.