ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు ఊరట దక్కినట్టే దక్కి…ఉసూరమంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో ఆయనతో పాటు ఐదుగురు నిర్దోషులని బాంబే హైకోర్టు (నాగ్‌పుర్ బెంచ్) తీర్పు ఇచ్చిందన్న ఆనందం కనీసం ఒక్కరోజు కూడా మిగలకపోవడం గమనార్హం. బాంబే హైకోర్టు సాయిబాబాకు శుక్రవారం ఊరటనిస్తే, శనివారం సర్వోన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది.
సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు శనివారం ప్రత్యేకంగా విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం సాయిబాబా సహా మిగిలిన ఐదుగురిని విడుదల చేయడంపై స్టే విధించింది. 2014 నుంచి సాయిబాబా జైల్లో వుంటున్నారు. గడ్చిరోలి కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. 2017లో ఆయన హైకోర్టులో సవాల్ విసిరారు. ప్రస్తుతం ఆయన నాగపూర్ జైల్లో వుంటున్నారు.
బాంబే హైకోర్టు ఆయన నిర్దోషి అని తేల్చి చెప్పడంతో పాటు మరే ఇతర కేసులు నమోదు కాకపోతే వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఆయనతో పాటు ఐదుగురు విడుదల అవుతారని భావించారు. ఈ లోపు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది.
ప్రొఫెసర్ సాయిబాబా తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ బసంత్ తన క్లయింట్ 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నారని, ఆయన ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని జైలు బయట, గృహ నిర్బంధంలో ఉంచాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనికి జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేదీ ధర్మాసనం అంగీకరించకపోవడం గమనార్హం. దీంతో ఆయన జైల్లోనే మగ్గిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది.