విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. మంత్రులు రోజా, జోగి రమేశ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడికి తెగబడ్డారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలనే డిమాండ్‌తో ఇవాళ ఆ మహానగరంలో గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ గర్జనకు మంత్రులు ఆర్కే రోజా, విడదల రజనీ, ధర్మాన , మేరుగ నాగార్జున, కొడాలి నాని, పేర్ని నాని తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమం అనంతరం రోజా, జోగి రమేశ్, వైవీ సుబ్బారెడ్డి తిరుగుప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా వారు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అదే సమయానికి జనసేనాని పవన్‌కల్యాణ్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సి వుంది. దీంతో పవన్‌కు స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.
ఎయిర్‌పోర్ట్ దగ్గర రోజా, జోగి రమేశ్, వైవీ సుబ్బారెడ్డి కార్లపై రాళ్లు, కర్రలతో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు. వైసీపీ నేతలకు ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్ లోపలికి పంపారు.
ఇదిలా వుండగా పవన్‌కల్యాణ్‌పై రోజా, జోగి రమేశ్ ఇటీవల ఘాటైన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వారిపై జనసేన కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. దాడికి పాల్పడ్డ వారెవరినీ విడిచి పెట్టొద్దని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది.