నాగశౌర్య, నాని చేస్తున్న సినిమాలు రెండూ ఒకటేనా?

ఇప్పుడు కాదు, కొన్ని నెలలుగా నలుగుతున్న న్యూస్ ఇది. నాని చేస్తున్న 'అంటే సుందరానికి', నాగశౌర్య నటిస్తున్న కృష్ణ వ్రింద విహారి సినిమాలు రెండూ ఒకటేననే చర్చ నడుస్తూనే ఉంది. ఈ రెండు సినిమాల్లో…

ఇప్పుడు కాదు, కొన్ని నెలలుగా నలుగుతున్న న్యూస్ ఇది. నాని చేస్తున్న 'అంటే సుందరానికి', నాగశౌర్య నటిస్తున్న కృష్ణ వ్రింద విహారి సినిమాలు రెండూ ఒకటేననే చర్చ నడుస్తూనే ఉంది. ఈ రెండు సినిమాల్లో హీరోలు బ్రాహ్మణ కుర్రాడి పాత్రలు పోషించడమే ఈ చర్చకు కారణం. ఎట్టకేలకు దీనిపై 'అంటే సుందరానికి' దర్శకుడు వివేక్ ఆత్రేయ స్పందించాడు.

“ఓ సారి నాకు కృష్ణ వ్రింద విహారి మూవీ సినిమాటోగ్రాఫర్ శ్రీరామ్ ఫోన్ చేశారు. తమ సినిమా కోసం వివేక్ సాగర్ ను సంగీత దర్శకుడిగా తీసుకునే అంశంపై మాట్లాడారు. అప్పుడు మాటల సందర్భంలో స్టోరీ అడిగాను. క్రిస్టియన్-హిందూ కాన్సెప్ట్ చెప్పారు. నాది కూడా దాదాపు అదే స్టోరీ అన్నాను. 

అప్పటికే నానికి నేను నెరేషన్ ఇచ్చాను. పత్రికల్లో ఆర్టికల్స్ కూడా వచ్చేశాయి. అంతకుమించి నేను అడగలేదు. క్రిష్ణ వ్రింద విహారి దర్శకుడు అనీష్ నాకు ఫ్రెండ్. అతడితో మాట్లాడాను. హీరో హిందూ బ్రాహ్మిణ్ అనే విషయం చెప్పాడు. నా సినిమాలో కూడా నాని బ్రాహ్మణుడు అని చెప్పాను. అంతవరకు మాత్రమే సిమిలారిటీ ఉంది. మిగతాదంతా సెపరేట్.”

ఇలా ఈ రెండు సినిమాల మధ్య సంబంధం లేదని స్పష్టం చేశాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. అలా అని 'అంటే సుందరానికి' కథ ఏదో కొత్తగా ఉంటుందని మాత్రం ఆశించొద్దని చెబుతున్నాడు. ఇదేదో కనీవినీ ఎరుగని స్టోరీ కాదని, అందరికీ తెలిసిన కథ, తెలిసిన ఎమోషన్లే ఉంటాయని, కాకపోతే తను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించానని అన్నాడు.

ఇక బ్రాహ్మణ సంప్రదాయాలు, క్రిస్టియన్ అమ్మాయితో రిలేషన్ షిప్ లాంటి వ్యవహారాలపై స్పందిస్తూ.. ఎవర్నీ కించపరచాలనే ఉద్దేశంతో తను సినిమా తీయలేదని, కేవలం ఓ కథను మాత్రమే ప్రజెంట్ చేశామని అన్నాడు. ఓ బ్రాహ్మణుడిగా తన కమ్యూనిటీలో ఉండే ఆచార వ్యవహారాలన్నీ తనకు బాగా తెలుసన్నాడు వివేక్ ఆత్రేయ.