మింగలేక.. కక్కలేక.. సజ్జల..

ఏపీలో కరెంటు కష్టాలు ఉన్నాయని ప్రతిపక్షాలు, ఎక్కడున్నాయని అధికార పక్షం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల పవన్ కల్యాణ్, మీడియాతో మాట్లాడుతున్న టైమ్ లో  కరెంటు పోయింది.…

ఏపీలో కరెంటు కష్టాలు ఉన్నాయని ప్రతిపక్షాలు, ఎక్కడున్నాయని అధికార పక్షం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల పవన్ కల్యాణ్, మీడియాతో మాట్లాడుతున్న టైమ్ లో  కరెంటు పోయింది. చూడండి ప్రభుత్వ అసమర్థత అంటూ ఆయన నోరు చేసుకున్నారు. అప్పటికప్పుడు అధికార పక్షం నుంచి కూడా కౌంటర్ పడింది. కావాలనే కరెంటు తీసేయించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు అధికార పార్టీ నేతలు.

కట్ చేస్తే.. ఇప్పుడా 'కటింగ్' సీన్ అధికార పార్టీ నేతకే ఎదురైంది. మామూలు వ్యక్తులకు ఎమ్మెల్యేలకు, మంత్రులకు అయితే ఓకే.. ఏదో సర్ది చెప్పుకునేవారు. కానీ కవరింగ్ బాధ్యతలు నెత్తిన మోస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికే కరెంటు కష్టాలు తప్పలేదు. దీంతో ఆయన ఏం చెప్పాలో తెలీక, ఎలా మాట్లాడాలో తోచక.. చివరకు విద్యుత్ ఉద్యోగులపై చిర్రుబుర్రలాడారు.

ఏం జరిగిందంటే..?

కడప జిల్లాలో ఎన్జీవోల సహకార గృహ నిర్మాణ సంఘం బిల్డింగ్ ప్రారంభోత్సవానికి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తుండగా మధ్యలో కరెంటు పోయింది. ఒకటి రెండుసార్లు కాదు నాలుగుసార్లు కరెంటు కట్ అవడం, మళ్లీ రావడంతో సజ్జల అసహనం వ్యక్తం చేశారు. 

దీంతో ఆయన ఎన్జీవోలు, విద్యుత్ ఉద్యోగులకు మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా అంటూ జోక్ చేసి, టాపిక్ ని మళ్లించే ప్రయత్నం చేశారు. పవర్ ఇచ్చేది మీరే, పవర్ కట్ చేసేది కూడా మీరేనంటూ ఎన్జీవోలను కాస్త బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు సజ్జల.

కరెంటు కష్టాలు ఉన్నట్టా.. లేనట్టా..?

ఏపీలో ప్రతిపక్షాల సభలకు కరెంటు కట్ అయితే, అది వారు కావాలని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేసిన పని. అదే అధికార పార్టీ వారి కార్యక్రమాల్లో కరెంటు పోతే.. దానికి బాధ్యులు ఉద్యోగులే. ఇలా ఉంది వ్యవహారం. దేశవ్యాప్తంగా కరెంటు కష్టాలు ఉన్న వేళ, వేసవిలో బొగ్గు సరఫరా తక్కువై, విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోయిన వేళ, కరెంటు కోతలు సహజం. దాన్ని సరిదిద్దడం ప్రభుత్వం చేయాల్సిన పని. 

బొగ్గు సరఫరా సరిగా ఉంటే కరెంటు ఉత్పత్తి తగ్గేది కాదు, ఈ కష్టాలు ఉండేవి కావు. ఇంతవరకు కరెక్టే. కానీ సరఫరా తగ్గుతుందని తెలిసి కూడా ప్రత్యామ్నాయాలు చూడకుండా కోతలకు వెళ్లడం ప్రభుత్వం చేసిన తప్పు.

కరెంట్ కోతలు ఉన్న ప్రతిసారి ప్రతిపక్షాలపై నిందలు వేసి, ఇప్పుడు అనుకోకుండా తామే ఇరుక్కుపోయారు అధికార పార్టీ నేతలు. కోతల్ని అధిగమించేందుకు ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ మరోవైపు కోతలు కొనసాగుతున్నాయనేది వాస్తవం. ఈ విషయాన్ని ప్రభుత్వం ఒప్పుకోకపోవడం వల్ల వచ్చిన తిప్పలివి.