విక్టర్ ప్రసాద్….వైసీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. మాజీ మంత్రి పేర్ని నాని సిఫార్సుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ సామాన్య దళిత నేత అయిన విక్టర్ ప్రసాద్‌కు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇది రాజ్యాంగబద్ధమైన పదవి. నియమించడం వరకే ప్రభుత్వ పని. తొలగింపు ప్రభుత్వ చేతుల్లో లేదు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన న్యాయవాది, దళితుల సమస్యలపై 30 ఏళ్లుగా పనిచేస్తున్నారన్న గౌరవంతో ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా మారుమూడి విక్టర్‌ప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. అయితే దళిత సమస్యల పరిష్కారానికి తన తెలివితేటల్ని, ఉద్యమ అనుభవాలను ఉపయోగిస్తుంటే ప్రభుత్వానికి ఇబ్బంది లేకపోయేది.
ప్రొటోకాల్ పేరుతో తమపై విక్టర్ ప్రసాద్ పెత్తనం చెలాయిస్తున్నారని ఏపీ ప్రభుత్వానికి పలువురు కలెక్టర్లు, ఎస్పీలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ విషయమై జాగ్రత్తగా వ్యవహరించాలని పలువురు వైసీపీ పెద్దలు విక్టర్ ప్రసాద్‌కు సూచించినా వినడం లేదని సమాచారం.
దళిత సమస్యల పేరుతో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన సందర్భంలో ఎంత పెద్ద స్థాయి అధికారినైనా అందరి ఎదుట మందలించడం, ఉద్యోగాలుండవని హెచ్చరించడం ప్రభుత్వానికి తలనొప్పైంది. ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దల మాటల్ని కూడా లెక్కచేయని విక్టర్ ప్రసాద్, ఓ కార్పొరేటర్ అభ్యంతరాన్ని ఆలకించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తిరుపతి కార్పొరేషన్ పరిధిలో తిమ్మినాయుడుపాళెం ఉంది. ఇది 50వ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి వైసీపీ తరపున బి.అనిల్ కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించాడు. ఈ డివిజన్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిన నాయకుడు అంబేద్కర్ విగ్రహాన్ని తెచ్చి పెట్టాడు. స్థానిక నాయకులకు తెలియకుండా, ఇతరుల ద్వారా విక్టర్‌ప్రసాద్‌ను సదరు లోకల్ టీడీపీ లీడర్ కలిశాడు. జూన్ 4న అంటే ఇవాళ విగ్రహావిష్కరణకు ప్లాన్ చేశాడు. విక్టర్ ప్రసాద్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు.
ఈ విషయం 50వ డివిజన్ వైసీపీ నాయకులకు తెలిసి ఆగ్రహానికి లోనయ్యారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, అలాగే స్థానిక కార్పొరేటర్ అయిన తనకు తెలియకుండా ఎలా వస్తారని విక్టర్ ప్రసాద్‌ను అనిల్ ప్రశ్నించాడు. అలాగే టీడీపీ నాయకుడి ఆగడాల గురించి అతని దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఈ విషయాలేవీ తనకు తెలియదని, ప్రొటోకాల్‌ను పక్కదారి పట్టించడం తన ఉద్దేశం కాదని …తిరుపతి పర్యటనను విక్టర్ ప్రసాద్ రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
విక్టర్ ప్రసాద్‌కు ఏం చెప్పి, ఒప్పించారనే ప్రశ్న వైసీపీ పెద్దల నుంచి రావడం గమనార్హం. కేవలం 50వ డివిజన్ వైసీపీ నేతలు క్షేత్రస్థాయిలో వాస్తవాలను వివరించడం వల్లే విక్టర్ ప్రసాద్ వినిపించుకున్నాడని తెలిసింది. మొత్తానికి వైసీపీలో ఓ మొండివాడు ఏం చేసినా చర్చనీయాంశమనేందుకు ఇదే నిదర్శనం.