చంద్రబాబు నాయుడు ట్వీట్.. ఇంకోటి మిస్ ఫైర్!

ఆఖరికి ట్వీట్లు కూడా సరిగా చేయలేకపోతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్లు. లోకేష్ రాజకీయం ఇప్పటి వరకూ ట్విట్టర్ దాటడంలేదు. చంద్రబాబు నాయుడి అధికారిక ట్విటర్ అకౌంట్ నుంచి నకిలీ ట్వీట్లు పోస్ట్ అవుతూ ఉన్నాయి.…

ఆఖరికి ట్వీట్లు కూడా సరిగా చేయలేకపోతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్లు. లోకేష్ రాజకీయం ఇప్పటి వరకూ ట్విట్టర్ దాటడంలేదు. చంద్రబాబు నాయుడి అధికారిక ట్విటర్ అకౌంట్ నుంచి నకిలీ ట్వీట్లు పోస్ట్ అవుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడి ఫేక్ ట్వీట్ల గోల జాతీయ పత్రికల వరకూ ఎక్కింది. ఫేక్ ట్వీట్లు పెట్టడం, మారు మాట్లాడకుండా డిలీట్ చేయడం.. గురించి జాతీయ మీడియా వర్గాలు కూడా కథనాలను ఇచ్చాయి.

ఆ సంగతలా ఉంటే చంద్రబాబు నాయుడు మరో ట్వీట్ వేశారు. కృష్ణానదికి జలకళ గురించి చంద్రబాబు నాయుడు బోడిగుండుకు, మోకాలికి ముడిపెడుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో తన ఐదేళ్ల పాలనలో 21 ప్రాజెక్టులు పూర్తి అయినట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో నెటిజన్లు గట్టిగా తగులుకున్నారు. పూర్తైన ఆ ప్రాజెక్టుల వివరాలు చెప్పమంటూ వారు కోరుతున్నారు. దానికి తెలుగుదేశం వర్గాల నుంచి స్పందనే లేదు.

''గత 5 ఏళ్లలో 21 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేశాం. వేలాది చెక్ డ్యామ్ లు, పది లక్షల పంటకుంటలు తవ్వాం. నీరు-చెట్టు, నరేగా పనులెన్నో చేశాం. జల సంరక్షణ ఉద్యమంగా జరిపాం. మనం చేసిన పనులకు సార్ధకత కృష్ణమ్మ పరవళ్లతోనే, తల్లి గోదావరి జలధారలతోనే..'' అంటూ ఒక ట్వీట్ పెట్టారు. అసలు నీరూ-చెట్టకూ, కృష్ణానది పరవళ్లకూ సంబంధం ఏమిటనేది మొదటి ప్రశ్న. నీరూ చెట్టుతో జరిగింది తెలుగుదేశం నేతల దోపిడీ. నాటిన మొక్కల సంరక్షణ చర్యలు లేకుండా, మొక్కల పేరుతో కోట్లు నాకేశారు. దాన్ని చంద్రబాబు నాయుడు మళ్లీ గుర్తుచేశారు.

ఇక 21 ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసినట్టుగా ప్రకటించుకున్నారు. అది కూడా ఐదేళ్లలోనేనట! చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులు అంటే అవి ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్ ల స్థాయికి మించవు. అలాంటి వాటి గురించి ఆయన 21 అంటూ ఏమైనా చెబుతున్నారా? అంటూ నెటిజన్లు కడిగేస్తున్నారు. ఇంతకీ ఆ 21 ప్రాజెక్టులు ఏవో ఎక్కడున్నాయో!

సీమ టీడీపీ నేతలు.. సద్దు చేయడం లేదు!