ఆ ఒక్క‌టీ త‌ప్ప‌…రఘురామ‌కు అన్నీ తెలుసు!

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఢిల్లీలో కూచుని ఏపీ రాజ‌కీయాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మార్క్ విశ్లేష‌ణ‌లు, సొంత పార్టీ, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఆయ‌న‌లో ఎవ‌రికీ తెలియ‌ని కాల‌జ్ఞాని వున్నార‌ని ఇప్పుడిప్పుడే జ‌నానికి తెలుస్తోంది.…

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఢిల్లీలో కూచుని ఏపీ రాజ‌కీయాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మార్క్ విశ్లేష‌ణ‌లు, సొంత పార్టీ, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఆయ‌న‌లో ఎవ‌రికీ తెలియ‌ని కాల‌జ్ఞాని వున్నార‌ని ఇప్పుడిప్పుడే జ‌నానికి తెలుస్తోంది. కాల‌జ్ఞాని పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి త‌ర్వాత భ‌విష్య‌త్‌ను ద‌ర్శించ‌గ‌లిగిన అతీంద్రియ శ‌క్తులు ర‌ఘురామ‌కు మాత్ర‌మే ఉన్న‌ట్టున్నాయి.

ఇదే సంద‌ర్భంలో ఆయ‌న్ను ఓ శాపం కూడా వెంటాడుతోంది. అదేంటంటే, లోకం గురించి తెలుసుకోగ‌లిగిన ఆయ‌న‌కు, త‌నకేం జ‌రుగుతుందో మాత్రం ప‌సిగ‌ట్టలేర‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు. పాపం, ఆ శాపం వ‌ల్లే కావ‌చ్చు, త‌న‌ను ఏపీ సీఐడీ ఓ రాత్రి చిత‌క్కొడుతుంద‌ని క‌నుక్కోలేక‌పోయారు. అందుకే ప్ర‌కృతి చాలా శ‌క్తిమంత‌మైంద‌ని అంటారు. ఎక్క‌డో ఒక చోట చెక్ అండ్ బ్యాలెన్స్ పెడుతుంటుంది.

విలువిద్య‌లో అర‌వీర భ‌యంకురుడైన క‌ర్ణుడిని కీల‌క స‌మ‌యంలో శాపాలు వెంటాడుతాయి. కురుక్షేత్ర స‌మ‌రంలో నిస్స‌హాయుడై అర్జునుడి చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. ర‌ఘురామ విష‌యంలో ఏపీ సీఐడీ ఒక్క‌టే శాప‌మైంది. మిగిలిన విష‌యాల్లో ర‌ఘురామ తోపు అని చెప్పాలి.

ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఏప్రిల్‌, మే నెల‌ల్లో వెళ్తార‌ని ర‌ఘురామ చెప్ప‌గ‌లిగారంటే, ఒక్క కాల‌జ్ఞానికి త‌ప్ప మ‌రెవ‌రికైనా సాధ్య‌మ‌వుతుందా? అనే ప్ర‌శ్న విన‌వ‌స్తోంది. ఆయ‌న్ను ఇంకో కీల‌క ప‌ద‌వి కూడా వ‌రించేలా వుంది. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీస్ విక్టిమ్ ఫోరాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. దీనికి జాతీయ అధ్య‌క్షుడ‌య్యే ఏకైక అర్హ‌త ర‌ఘురామ‌కృష్ణం రాజుకు మాత్ర‌మే ఉంద‌ని బాధితులంతా ముక్త కంఠంతో ఏక‌గ్రీవ తీర్మానం చేశార‌ని వార్త‌లొస్తున్నాయి. భ‌విష్య‌త్‌లో ఇలాంటి అనుభ‌వాలు మ‌రిన్ని పొందాల‌ని, ఉన్న‌త ప‌ద‌వుల్లో అధిష్టించాల‌ని ఆకాంక్షిస్తూ…తోపు ర‌ఘురామ‌కు శుభాకాంక్ష‌లు.