విశాఖ గర్జన పేరుతో ఉత్తరాంధ్ర జూలు విదిల్చింది. ఇంత కాలం ఉత్తరాంధ్ర వేరు, ఇకపై వేరు అని ఆ ప్రాంతం చెప్పకనే చెబుతోంది. సాగరతీరాన ఉత్తరాంధ్ర ఆవేదన కడలి ఘోషలా మార్మోగుతోంది. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దంటూ తమ ప్రాంతంపైకి దండయాత్రగా వస్తున్న వారికి వ్యతిరేకంగా, ఉత్తరాంధ్ర ప్రజానీకం కడలి తరంగంలా ఎగిసిపడుతోంది.
ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ ఇవ్వాలని ఎవరూ అడగలేదు. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ విమర్శల్లో నిజం వుంది. కానీ ఉత్తరాంధ్రకు రాజధాని ఆశ చిగురింపజేయడంలో జగన్ సర్కార్ విజయవంతమైంది. ఇది అనూహ్య పరిణామం. విశాఖకు పరిపాలన రాజధాని వద్దంటే మాత్రం పరిణామాలు మునుపటిలా ఉండవు. అమరావతిలోనే ఏకైక రాజధాని ఉండాలనే డిమాండ్‌పై అరసవెల్లికి చేపట్టిన పాదయాత్ర … ఉత్తరాంధ్ర పుండుపై కారం చల్లినట్టైంది.
అమరావతి రెండో దఫా పాదయాత్రకు ముందు, ఆ తర్వాత అని విభజించి, ఉత్తరాంధ్ర పరిణామాలను చూడాల్సి వుంటుంది. అసలు ఈ పాదయాత్ర చేపట్టడమే పెద్ద తప్పు అని ఇప్పుడిప్పుడే వారికి అర్థమవుతోంది. అనవసరంగా నిద్రాణమైన ఉన్న రాజధాని అంశాన్ని గెలికినట్టైంది. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ పాదయాత్ర ఎందుకు చేశారో వారికే తెలియాలి.
ఎప్పుడైతే ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దని అమరావతి నుంచి పాదయాత్ర మొదలు పెట్టారో, అప్పుడే తీవ్ర వ్యతిరేకతకు బీజం పడింది. తమపై దండయాత్రకు వస్తున్నారని ఉత్తరాంధ్ర భావించింది. అసలే నక్సల్బరీ ఉద్యమానికి కేంద్రమైన ఉత్తరాంధ్రలో చైతన్యానికి కొదవలేదు.
దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని వెలుగెత్తి చాటిన మహారచయిత గురజాడ, మహాకవి శ్రీశ్రీ, అలాగే వంగపండు, రావిశాస్త్రి లాంటి గొప్ప వారిని కన్న నేల ఉత్తరాంధ్ర. తన విప్లవ కవిత్వంతో ప్రపంచాన్నే చైతన్యపరిచిన శ్రీశ్రీ వారసత్వం ఉత్తరాంధ్రకు ఉండనే ఉంది. వంగపండు గజ్జ కట్టి, ఆడిపాడి ఉత్తరాంధ్రను చైతన్యం వైపు నడిపించారు. అలాంటి ప్రాంతానికి “మీకు రాజధాని వద్దు, అభివృద్ధి వద్దు, ఏమీ వద్దు” అనే డిమాండ్‌తో “అమరావతి” పాదయాత్రగా వెళితే…కడుపు మండదా? అందుకే తాజాగా ఉత్తరాంధ్ర విశాఖ గర్జనై… జూలు విదిల్చింది.
“విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, మరో 25 ఏళ్లలో ఇంకో విభజన యుద్ధం తప్పదు” అని నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ చేసిన హెచ్చరికలో లోతైన అర్థం దాగి వుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ “అమరావతి” చేతిలో వుంది. అత్యాశతో రాష్ట్ర విభజనకు కారకులవుతారా? అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉండాలనే మంచి మనసుతో ఏపీ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుంటారా? అనేది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.