తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అర్జెంటుగా అనంతపురం జిల్లా పర్యటన పెట్టుకోవాలని కోరుతున్నాయి ఆయన అభిమాన సంఘాలు. చంద్రబాబు అర్జెంటుగా అనంతపురం వైపు వెళ్లాలని వారు ఆకాంక్షిస్తున్నారు. అప్పుడు కానీ ఈ భారీ వర్షాలకు అడ్డుకట్ట పడదనేది వారి ఫీలింగ్ లాగుంది. వద్దంటే వాన అనే పరిస్థితి ఉన్న అనంతపురం వైపు అర్జెంటుగా చంద్రబాబు వెళితే పరిస్థితిలో మార్పు వస్తుందని, ఆయన అడుగు పెడితే వర్షాలు ఆగుతాయనే కామెంట్ సీమ సందుల్లో వినిపిస్తోంది!
చంద్రబాబు అడుగుపెట్టిన చోట వాన ఉండదనేది పాత మాటే. కరువు, చంద్రబాబు కజిన్ బ్రదర్స్ లాంటి వారనే అభిప్రాయాలున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రాయలసీమలో కరువు రాజ్యమేలుతూ ఉంటుంది. వర్షాల సంగతలా ఉంచి, భూగర్భ జలాలు కూడా ఎండిపోయి, చెట్టూచేమ ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. చివరగా చంద్రబాబు ఏలిన 2014-19ల మధ్యన కూడా కరువు కరాళ నృత్యం చేసింది. సాగు నీరు మాట అటుంచి, తాగు నీరు కూడా కష్టం అయ్యింది పల్లెల్లో. పంటలు దక్కడం మాట నుంచి, ఎదిగిన చెట్లు కూడా నిలువునా ఎండిపోయాయి.
అలాగే 1995 నుంచి 2004ల మధ్య కూడా రాయలసీమ విపరీత స్థాయి కరువులను చూసింది. కనీవినీ ఎరగని కరువులు అవి. ఇలా చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనే అభిప్రాయాలు వినిపించాయి. చంద్రబాబు వైరి పక్షాలు కూడా అవి అందుకున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడంటే వర్షాలు కురవవని, కరువులే అనే ప్రచారం, అభిప్రాయాలు గట్టిగా ఉన్నాయి.
ఇలాంటి నేపథ్యంలో.. భారీ వర్షాలతో రాయలసీమ సతమతం అవుతోంది. వాన వద్దురా బాబోయ్ అని సీమ జనాలు అనుకుంటున్నారు. దీంతో.. అర్జెంటుగా చంద్రబాబును అటు వైపు రమ్మంటున్నారు జనాలు. అప్పుడు కానీ వరుణుడు శాంతించడని.. చంద్రబాబు అడుగు పెడితే వర్షాలు అట్టే ఆగిపోతాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. మరి చంద్రబాబు రాయలసీమ వైపు దృష్టి పెట్టాలి.
భారీ వర్షాలతో సతమతం అవుతున్న తరుణంలో.. అటు వైపు వెళ్లి వర్షాలు ఆగిపోయేలా చూడాల్సిన బాధ్యత ఆయనపై ఎంతైనా ఉందని అభిమాన, దురాభిమాన సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ విషయంలో చంద్రబాబుపై రాయలసీమ పచ్చచొక్కాలైనా ఒత్తిడి తేస్తాయేమో!