అనగనగా ఓ పెద్దాయిన. బోలెడు ఆస్తి సంపాదించాడు. సంపాదించినన్నాళ్లూ కష్టపడుతూనేే వచ్చాడు. తన జీవిత చరమాంకంలో కాస్త సుఖపడదామనుకున్నాడు. తన ఆస్తిని తన చిత్తానికి ఖర్చు చేసుకోవడం ప్రారంభించాడు. అంతే కొడుకులకు, అల్లుళ్లకు కోపం వచ్చింది. అతగాడిని ఇంట్లో లాగి బయట పడేసి ఆస్తులు అన్నీ జాగ్రత్త చేసారు.
పైగా ఇలా చేసిందంతా ఆయన ఆస్తి కాపాడదాం అనే తప్ప తమకే దురుద్దేశం లేదు..కావాలంటే చూడండి. ఇంటి హాలులో పెద్దాయిన ఫొటొ పెద్దది పెట్టాం. నిత్యం మంచి పూల దండ తెచ్చి వేస్తున్నాం. ఇంతకన్నా ఏం కావాలి..ఏం చేయాలి. ఇదంతా ఆయన ఆస్తి కాపాడ్డానికి తప్ప, మాకోసం కానే కాదు. అంటూ చెబుతున్నారు.
సరే ఇంకో కథ చూద్దాం.
ఇద్దరు దొంగలు..కలిసికట్టుగా వేరే వాడి ఇంట్లో పడి దొచేసారు. చాలా కాలం తరువాత ఇద్దరూ తీరుబడిగా ఓ దగ్గర సిట్టింగ్ వేసారు. అవును మనం ఆ రోజు అలా దొచుకోవడం తప్పంటావా? అంటూ ఒకరు. అబ్బే అస్సలు కానే కాదు. అలా దోచుకోవడం వల్లనే వాళ్ల ఆస్తిని మనం కాపాడినట్లు అయింది. కచ్చితంగా చెబుతున్నా కదా..మనం చేసింది తప్పు కానే కాదు అన్నాడు రెండో వాడు.
కానీ ఈ ఇద్దరు కలిసి చేసింది తప్పా? ఒప్పా? అన్నది చెప్పాల్సింది ఎవరు? దోపిడీకి గురైన వారా? మరో మధ్యవర్తా? లేదా వీళ్లకు వీళ్లే తమది తప్పు కాదు అని సర్టిఫికెట్ ఇచ్చేసుకోవడమా?
నిన్నటికి నిన్న ఓ షో లో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ మాట్లాడిన మాటలు విన్న తరువాత పై రెండు కథలు గుర్తుకు వచ్చాయి. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని కాపాడ్డం కోసం ఆయననే పార్టీ నుంచి బయటకు తోసేసారట. ఎంత గొప్ప విషయం. పైగా రాముడు..ఆంజనేయుడితో పోల్చుకోవడం. నిజమే రాముడిని ఆంజనేయుడు ఎదిరించింది తన కోసం కాదు. రాముడు తప్పు చేస్తున్నాడని కాదు. తప్పని సరి పరిస్థితుల్లో. అదే విధంగా రాముడిని ఆంజనేయుడు అవమానం పాలు చేయలేదు, అనాధగా చనిపోయేలా చేయలేదు. ఇవన్నీ తెలియకుండా జనాలను తమ తెలివితేటలతో మభ్య పెట్టాలని చూస్తే ఎలా?
ఇక్కడ బాలయ్య బాబుకి తెలియంది ఏమిటంటే? ఇన్నాళ్లూ వెన్నుపోటు అంటే చంద్రబాబునే గుర్తు తెచ్చుకున్నారు, తెచ్చుకుంటున్నారు జనాలు. కానీ ఇప్పుడు అన్యాపదేశంగా చంద్రబాబు ఏం చెప్పారు. ‘ఆ రోజు నువ్వు, నేను, హరికృష్ణ, బివి మోహన్ రెడ్డి’ కలిసి వెళ్లాం, కలిసి చేసాం అంటున్నారు. అంటే చాలా తెలివిగా ఈ పాపంలో బాలయ్యను, హరికృష్ణను భాగస్వాములను చేస్తున్నారు. పనిలో పనిగా ఓ ‘రెడ్డి’ని కూడా కలిపారు.
నిజానికి ఆ రోజు అలా వెళ్లిన బివి మోహన్ రెడ్డి ఉత్తరోత్తరా ఎన్టీఆర్ తోనే వున్నారు కదా? అదీ కాక అసలు వీరందరినీ ప్రేరేపించింది ఎవరు? విశాఖ డాల్ఫిన్ లో సమావేశం పెట్టింది ఎవరు? ఊరేగింపుగా వెళ్లడానికి లీడ్ చేసింది ఎవరు? ఇది జరిగేనాటికి బాలయ్య రాజకీయాల్లో లేరు. అందువల్ల పార్టీ ఎటు పోయినా బాలయ్యకు వచ్చిన నష్టం లేదు. అధికారం దూరమవుతున్నది అప్పట్లో చంద్రబాబుకే.
అందువల్ల ఎటు చూసినా తప్పు చంద్రబాబు వైపే వుంటుంది. పైగా తనది తప్పా అని చంద్రబాబు ఆ తప్పిదంలో భాగస్వామి అయిన బాలయ్యను అడగడం ఎందుకు? తప్పో కాదో ఎన్టీఆర్ నే చెప్పిన వీడియోలు వున్నాయి కదా? అవి ఇదే షో లో ప్లే చేసి వుంటే బాగుండేది కనా?
అయినా ఇదే షో బాలయ్య ఓ ముచ్చట చెప్పారు. చిన్నప్పుడు లోకేష్ వచ్చి ఇది నాది..ఇది నాది అని అంటే మూట కట్టి పైకి విసిరేస్తా అని అనేవారట బాలయ్య సరదాగా. మరి లక్ష్మీ పార్వతి వచ్చి, ఎన్టీఆర్ తో కలిసి పార్టీ నాది అంటే ఏం చేస్తారు. బాలయ్య దగ్గర ఎవరికైనా ఒకటే రూలు కదా? అందుకే మూట కట్టి రోడ్డున పడేసారు అనుకోవాలి.
ఇవన్నీ మనం చెప్పడం కాదు. చరిత్ర లో జరిగినవి. ఎన్టీఆర్ విలపిస్తూ చెప్పినవి. వీడియో సాక్ష్యాలు ఇంకా పదిలంగానే వున్నవి. ఇప్పుడు ‘షో’ చేస్తే..అబద్దాలు నిజమైపోవు. తప్పులు ఒప్పై పోవు.