పోలవరం ప్రాజెక్టు అథారిటీ హైదరాబాదులో తాజాగా ఓ సమావేశం నిర్వహించి, పనుల పరిస్థితిని సమీక్షించింది. ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల్ని, ప్రాజెక్టు నిర్మాణం చూస్తున్న ఇంజినీర్లు కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే పోలవరం అథారిటీ అధికారులు, ఛైర్మన్ ఆర్ కె జైన్ అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. అంటే సరైన ప్రణాళికతో, ముందు ఆలోచనతో, హేతువుతో వ్యవహరించకుండా… తొందరపాటు నిర్ణయంగానే కాంట్రాక్టు రద్దు నిర్ణయం తీసుకున్నారని అర్థమైపోతోంది. అథారిటీ ముందు ప్రభుత్వ వాదన తుస్సుమంది.
నిజానికి పోలవరం అథారిటీ బాధ్యత.. ప్రాజెక్టు ఆలస్యం కాకుండా చూడడం మాత్రమే. టెండర్లు పిలవడానికి, రద్దు చేయడానికి అధికారం రాష్ట్రప్రభుత్వం అథారిటీ అనుమతి తీసుకోనక్కర్లేదు. అయితే అలాంటి నిర్ణయం వల్ల పడే ఆర్థిక భారంతో కూడా అథారిటీకి సంబంధం లేదు. ఆ విషయాలను ఆర్ కె జైన్.. సమావేశం అనంతరం విలేకర్ల సమావేశంలో స్పష్టంగా చెప్పారు.
సమావేశంలో వారు.. ప్రధానంగా పనుల జాప్యం, నాణ్యత, ఆర్థిక భారం గురించి, చర్చించారు. నవంబరు 1 నాటికి పనులు తిరిగి ప్రారంభిస్తామనే విషయాన్ని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ వాదనతో అథారిటీ అధికార్లను నమ్మించలేకపోయింది. వైకాపా మంత్రి, నాయకులు అదేమాట చెబుతున్నారు గానీ.. అవి రాజకీయ ప్రకటనలు కాకూడదు. అధికార్ల బృందం ముందు వారు ధాటిగా చెప్పలేకపోయారు.
కొత్తగా రీటెండరింగ్ కు వెళితే.. పాత సంస్థ చేస్తున్న మొత్తానికంటె తక్కువకు కొత్త కాంట్రాక్టర్లు వస్తారనే నమ్మకం ఉందా? అనే ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వాధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఈ దశలో కొత్త సంస్థకు పనులు అప్పగిస్తే.. యంత్రాలు సమకూర్చుకోడానికి సమయం పడుతుంది కదా అనే ప్రశ్నకు పేలవమైన జవాబిచ్చారు. నవయుగ సంస్థకు చెందిన యంత్రాలనే కొత్త కాంట్రాక్టరు వాడుకునేలా చూస్తాం అని వారు సెలవిచ్చారు.
ఇంత అసంబద్ధమైన వాదన మరొకటి ఉండదు. పనులు సరిగాచేయడం లేదని, నవయుగను తొలగిస్తూ అదే సమయంలో మీ యంత్రాలన్నీ అక్కడే ఉంచండి… మేం వేరే వారితో చేయించుకుంటాం అంటున్న వాదన ఇది. దానికి అథారిటీ అధికారులు.. ‘ఆ విషయం టెండరు నిబంధనల్లో పొందుపరుస్తారా’ అనే ప్రశ్నతో ఇరుకున పెట్టారు. దాంతో రాష్ట్రప్రభుత్వం తరఫున వెళ్లిన అధికారులు పూర్తిగా చేతులు ఎత్తేశారు. అలా సాధ్యంకాదని చెప్పారు.
ప్రభుత్వపు ఇలాంటి నిరర్థకమైన వాదన వలన.. కాంట్రాక్టు రద్దు ద్వారా ఎలాంటి కొత్త సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయో.. వాటి విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి సంసిద్ధత లేదని, ఆలోచన కూడా లేదని తేటతెల్లమైపోతోంది. అసలు ప్రభుత్వం ఈ సంక్లిష్టతను ఎందుకు తమంతగా తాము సృష్టించుకున్నదో కూడా అర్థంకాని సంగతి.