పోలవరం ప్రాజెక్టు కాస్తా.. పోలభారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం పనులనుంచి నవయుగ సంస్థతో ఉన్న కాంట్రాక్టును జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రద్దు చేసేసింది. కానీ.. ఈ వివాదం ఇంతటితో ముగిసిపోయే అవకాశం కనిపించడం లేదు. పోలవరం నిర్మాణానికి సంబంధించి.. ముప్పు మూడు రకాలుగా పొంచి ఉంది. పోలవరం నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో ఈ ముప్పు ఏమిటో చర్చకు వచ్చింది. మూడురకాల ముప్పుతప్పే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తమ నిర్ణయం విషయంలో పునరాలోచనలో పడే పరిస్థితి కూడా తలెత్తవచ్చు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ హైదరాబాదులో తాజాగా ఓ సమావేశం నిర్వహించి, పనుల పరిస్థితిని సమీక్షించింది. ఈ సమావేశంలో వారు లేవనెత్తిన సందేహాలు చాలా సబబుగా ఉన్నాయి. కాంట్రాక్టు రద్దు వలన అథారిటీ పేర్కొన్న సందేహాల్లో ప్రధానంగాన మూడు అంశాలున్నాయి. దీనివలన 1) పనుల్లో మితిమీరిన జాప్యం అవుతుందని పేర్కొంది. 2) నిర్మాణ వ్యయం చాలా పెరుగుతుందని, పెరిగే భారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం భరించబోదని తేల్చి చెప్పింది. 3) నైపుణ్యం, డిజైన్ల సమన్వయానికి పూచీ ఎవరు? అని అడిగింది.
ఇందులో 1వ సమస్య అందరికీ తెలిసిందే. నిజాయితీగా జరగడం ముఖ్యం, కొన్ని నెలలు ఆలస్యం అయినా పర్లేదు.. అని ప్రభుత్వం చెప్పుకోవచ్చు. కానీ.. ఇలాంటి మార్పువలన జరిగేది నెలల ఆలస్యంకాదు.. సంవత్సరాల ఆలస్యం అనేది నిజం. దానిని ప్రస్తుతానికి ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చు. కానీ పని పూర్తి అయితే తప్ప.. ఆ సంగతి తేలదు. 2వ సమస్య నిర్మాణ వ్యయం. ఇది జాతీయ ప్రాజెక్టు. రాష్ట్ర విభజన ద్వారా మనకు దక్కిన ఏకైక లాభం అది. దానిని ఇప్పుడు వ్యయం పెంచేలా చేస్తే.. పెరిగే వ్యయంలో ప్రతిరూపాయి రాష్ట్రప్రభుత్వం మీద పడుతుంది. అసలే ఆర్థికవనరుల లేమితో ఉన్న ప్రభుత్వం మరింతగా సమస్యల్లో కూరుకుపోతుంది.
3వ సమస్య పైకి కనిపించేంత చిన్నదికాదు. దీనివల్ల చాలా ఇబ్బందులుంటాయి. ప్రాజెక్టు నాణ్యత, ఎంతకాలం, ఎంత దృఢంగా మనగలుగుతుంది లాంటి అంశాలన్నీ ఇందులో మిళితమై ఉన్నాయి. డిజైన్లు మారకపోవచ్చు. కానీ.. సాంకేతికత, నైపుణ్యాలు కాంట్రాక్టరుతో పాటు మారుతాయి. దానివలన ప్రాజెక్టు ఏమౌతుందో తెలియదు. వీటిని సమన్వయం చేసుకోవడానికి ఎవరు బాధ్యత వహిస్తారో తెలియదు.
నవయుగ పనితీరు బాగానే ఉందని కూడా పోలవరం అథారిటీ పేర్కొంది. ‘ఎంత’ అనేది చెప్పలేకపోయినా.. భారం పెరగడం మాత్రం గ్యారంటీ. అథారిటీ ఛైర్మన్ జైన్ అదేసంగతి చెబుతున్నారు. మరి ఆ భారం మోయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? లేకపోతే.. కాంట్రాక్టు రద్దు నిర్ణయాన్ని పునస్సమీక్షించుకుని, పనులను వేగంగా నడిపించడం మీద మాత్రమే దృష్టిపెట్టాలి.