ఆర్టికల్ 370 రద్దు తాలూకు పర్యవసానాలు.. ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్ లో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి… ఆ రాష్ట్రం ఆహ్వానం పలుకుతోంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా.. జమ్మూకాశ్మీర్ లో ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సు జరగనుంది. అక్టోబరు 12నుంచి మూడురోజుల పాటూ ఈ సదస్సును నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. అక్కడ పరిశ్రమలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, వనరులు, మౌలిక వసతులు వంటివాటిగురించి.. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఔత్సాహికులకు వివరించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఇది మంచి ముందడుగుగా భావించాలి. 370 వలన ఇలాంటి ఏ వెనుకబాటుతనం కలకాలంగా కాశ్మీరులో ప్రబలి ఉందని కేంద్రం భావించిందో… దానిని పారద్రోలడానికి ఇప్పుడు ఒక ప్రయత్నం జరుగుతోంది. ఈ తొలి అడుగులో అద్భుతాలు జరిగిపోతాయని లెక్కకు మిక్కిలిగా పరిశ్రమలు , పెట్టుబడులు అక్కడకు వెల్లువెత్తుతాయని అనుకోనక్కర్లేదు. కానీ, ఖచ్చితంగా కొంత ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కంటె మెరుగైన దశ వస్తుంది.
జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి పెట్టుబడుల సదస్సు ఇప్పటిదాకా జరగనేలేదు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం రద్దయి, రాష్ట్రపతి పాలన నడుస్తున్నది. కేంద్రపాలిత ప్రాంతంగానే ఉన్నది. ఈ దశలోనే కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెట్టుబడుల సదస్సు ద్వారా శ్రీకారం చుడుతున్నారు. మరికొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు.
మన దేశంలో అహ్మదాబాద్, ముంబాయి, కోల్‌కత్, బెంగుళూరు, హైదరాబాదు వంటి నగరాలతో పాటు, దుబాయ్, అబుదాభి, లండన్, నెదర్లాండ్స్, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో రోడ్ షోలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ ఒక్క అక్టోబరు పెట్టుబడిదార్ల సదస్సుకే.. పెదపెద్ద సంస్థల నుంచి రెండువేల మంది ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. ఇదంతా జమ్మూకాశ్మీరంలో ఆవిష్కృతం కాకున్న నవశకానికి తొలి అధ్యాయం కావొచ్చు.