‘పేకాట బురద’ తానూ పులుముకున్న పవన్

దారినపోయే దరిద్రాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ నెత్తికి తగిలించుకుంటున్నారు. దీని ద్వారా కార్యకర్తలకు తాను ఎప్పటికీ అండగా నిలబడతానని, వారికోసం పోరాడడానికి సిద్ధంగా ఉంటానని బిల్డప్ ఇవ్వడానికి, కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి సాధ్యమవుతుందని ఆయన…

దారినపోయే దరిద్రాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ నెత్తికి తగిలించుకుంటున్నారు. దీని ద్వారా కార్యకర్తలకు తాను ఎప్పటికీ అండగా నిలబడతానని, వారికోసం పోరాడడానికి సిద్ధంగా ఉంటానని బిల్డప్ ఇవ్వడానికి, కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి సాధ్యమవుతుందని ఆయన కలగంటున్నారో ఏమో తెలియదు గానీ.. సాధారణ ప్రజల దృష్టిలో మాత్రం ఆయనకున్న పరువు కూడా పోతుందని తెలుసుకుంటున్నట్లు లేదు. పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే ను ఇరుకున పెట్టిన పేకాట బురదను పవన్ కల్యాణ్ తన ఒంటికి కూడా పులుముకుంటున్నారు.

రాజోలు నియోజకవర్గం మలికిపురం లో పోలీసులు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారిని విడుదల చేయించడానికి అక్కడి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పూనుకున్నారు. అనుచరుల్ని కాపాడుకోవడం ఆయనకు అవసరమే. అయితే, సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు ఫోను మీద తేలిపోవాలి. ఎమ్మెల్యే రాపాక అలా ముగించలేకపోయారు. ఎస్సై మాట వినలేదని అనుచరులతో కలిసి దండుగా బయల్దేరి పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. స్టేషన్ పై దాడికేసులో ఇరుక్కుని అరెస్టయ్యారు. తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. జనసేన ఎమ్మెల్యేపై కేసు.. ఒక ప్రధాన వార్త అయిపోయింది.

ఇదంతా ఒక ఎత్తు. అక్కడితో ఆ వ్యవహారాన్ని చల్లబరచేసి ఉంటే సరిపోయేది. సద్దుమణిగిపోయేది. కానీ.. పవన్ కల్యాణ్ దానిని తిరగదోడారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుడిని పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చినందుకు, విడిపించడానికి వెళ్లిన జనసేన ఎమ్మెల్యేపై కేసులు సబబు కాదంటూ ఆయన ఓ వీడియో సందేశం పోస్టు చేశారు. రాజోలుకు వచ్చి ఉద్యమిస్తానని కూడా పవన్ అన్నారు. ఈలోగా రాపాకకు బెయిల్ రావడంతో.. అంత పనీ జరగలేదు.

కానీ స్వచ్ఛ రాజకీయాలను లక్ష్యిస్తున్న పవన్ కల్యాణ్ ఇలాంటి చొరవ ద్వారా ఏం చెప్పదలచుకున్నారు? ఇంతకు ఆయన ఎవరిని సమర్థిస్తున్నారా? పేకాట ఆడుతూ దొరికిపోయిన తమ పార్టీ నాయకుడినా? లేదా, అతని విడుదల కోసం వెళ్లి పోలీసు స్టేషన్ పై దాడిచేసి అద్దాలు పగులగొట్టించిన తన ఎమ్మెల్యేనా? అనేది క్లారిటీ రావడంలేదు.

దొమ్మీ వంటి కేసుల విషయంలో నాయకులు ఎంతకు తెగించి దూకుడు ప్రదర్శించినా బాగుంటుంది. తమ కార్యకర్తలను అనవసరంగా ఇరికించారని వాదించుకోడానికి అవకాశం ఉంటుంది. కానీ పేకాట వంటి కేసులకోసం, కిడ్నీ వ్యాధి లాంటి ముసుగు తొడిగి పోరాడితే అభాసుపాలవుతారు.

సీమ టీడీపీ నేతలు.. సద్దు చేయడం లేదు!