కశ్మీరు విషయంలో మోదీ చేస్తున్నది సాహసం అని చాలామంది అంటున్నారు, దుస్సాహసం అని నా బోటి వాళ్లు (ఎందరున్నారో తెలియదు) అంటున్నారు. ఏది కరక్టో ఓ ఏడాదిలో తెలిసిపోతుంది. ఇప్పటికిప్పుడు అంతా అద్భుతంగా ఉంది అని ప్రభుత్వ యంత్రాంగం ప్రచారం చేస్తుంది. వ్యతిరేక కథనాలను బయటకు రానివ్వదు. ఎమర్జన్సీ టైములో సెన్సార్‌షిప్ ఉండడం వలన ప్రభుత్వమే చీకట్లో ఉండిపోయింది. ఒకసారి కమ్యూనికేషన్లపై నిర్బంధం ఎత్తివేశాక, కశ్మీరులో ఏం జరుగుతోందో బిబిసి, రాయిటర్స్ వంటివి పూర్తిగా బయట పెడతాయి. అశాంతి తగ్గలేదు అని రిపోర్టులు వస్తే ప్రభుత్వం కొట్టి పారేస్తుంది. కొన్నాళ్లకు వాస్తవం బయటకు వచ్చి తనను తాను ఆవిష్కరించుకుంటుంది.
అందరు చెప్పేది ఒకటే – కశ్మీరులో శాంతిభద్రతలు నెలకొనాలి. టూరిజం పెరిగి, అక్కడి ప్రజలకు జీవనోపాధి తిరిగి రావాలి. అప్పుడే యీనాటి చర్య సఫలమైనట్లు లెక్క! దానికి గాను కావలసినది – యువతకు ఉద్యోగాలు కల్పించి, ఉగ్రవాదం నుంచి వారిని మళ్లించాలి. అందుకే మోదీ సర్కారు కశ్మీరేతరులను అక్కడ భూమి కొని, పరిశ్రమలు పెట్టి స్థానికులకు ఉద్యోగాలిమ్మనమని ప్రోత్సహిస్తానంటోంది. పారిశ్రామికవేత్తల సదస్సు కూడా పెడుతోంది. 370 రద్దు వలన ఉద్యోగాలు వచ్చి పడతాయని కశ్మీరు యువతను ఊరిస్తోంది. అది సాధ్యమా? అసలు దేశంలోనే మోదీ హయాం వచ్చాక నిరుద్యోగిత ప్రబలింది. ఆ విషయాన్ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సంస్థే గణాంకాలతో సహా బయట పెట్టేసరికి ప్రభుత్వం కంగారు పడి, దానిని కొట్టి పడేసింది. గణాంకాలను ఎదుర్కోవడం మోదీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
ప్రణాళికలు రచించడానికి, పథకాలు రూపొందించడానికి ప్రభుత్వానికి గణాంకాలు చాలా ముఖ్యం. నాయకుల చుట్టూ భట్రాజులు చేరి ఆహాఓహో అంటూ, అసలు విషయం తెలియకుండా చేస్తారు. కానీ గణాంకాలు అద్దం లాటివి. మన మొహాన్ని యథాతథంగా చూపిస్తాయి. ఆ విషయాన్ని తొలి ప్రధాని నెహ్రూ గుర్తించి, 'భారత గణాంక పిత' అనదగిన పిసి (ప్రశాంత చంద్ర) మహాలనోబిస్ (1893-1972)ను ఎంతో ప్రోత్సహించారు. మహాలనోబిస్ ఇంగ్లండులో తర్ఫీదై, కలకత్తాకు వచ్చి కొందరు మిత్రులతో కలిసి 1932లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. భారీ స్థాయిలో శాంపుల్ సర్వేలు ఎలా నిర్వహించాలో, గణాంకాలను ఎలా యింటర్‌ప్రెట్ చేయాలో అనేకమందికి తర్ఫీదు నిచ్చారు.
నెహ్రూ తన సెక్రటరీ పీతాంబర్ పంత్ ద్వారా ఆ సంస్థను బలోపేతం చేయడమే కాక, మహాలనోబిస్‌ను తొలి ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా చేశారు. రెండో పంచవర్ష ప్రణాళిక ద్వారా భారత్‌ను పారిశ్రామికీ కరణ దిశగా నడిపించేందుకు మార్గదర్శనం చేసినది మహాలనోబిసే. ప్రభుత్వంలో గణాంకాల శాఖ ఎలా ఉండాలో పునాదులు వేసినది ఆయనే. 1972లో ఆయనకు పద్మవిభూషణ్ యిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వంలో స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ శాఖ ఉంది. దానికి ఓ సెక్రటరీ ఉన్నారు. ఈ ప్రభుత్వ శాఖకు, నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్ (ఎన్‌ఎస్‌సి)కి యుద్ధం సాగుతోంది. ఎన్‌ఎస్‌సి ఒక స్వతంత్ర సంస్థగా వ్యవహరించాలని రంగరాజన్ కమిషన్ 2001లో సూచించింది. దాన్ని 2005 జూన్‌లో అమలు చేశారు. జిడిపి బ్యాక్ సీరీస్ విషయంలో ఆ సంస్థ రియల్ సెక్టార్ కమిటీ యిచ్చిన నివేదిక యిబ్బందికరంగా పరిణమించింది. దాని ప్రకారం యుపిఏ హయాంలో జిడిపిలో సాధించిన వృద్ధి ఎన్‌డిఏ హయాం లోని నాలుగేళ్ల వృద్ధి కంటె ఎక్కువగా ఉంది.
మోదీ ప్రభుత్వం జిడిపి యొక్క బేస్ ఇయర్ 2004-05 నుంచి 2011-12కి మార్చేసింది. కానీ స్పష్టమైన చిత్రం రావాలంటే కొన్ని రంగాల్లో డేటా లభ్యం కాలేదు. దానివలన కమిటీ ఒకలా లెక్క వేస్తే, ప్రభుత్వం మరోలా వేసింది. కమిటీ ప్రకారం యుపిఏ-1 హయాం (2004 నుంచి 2009) వరకు జిడిపి 8.87%, యుపిఏ-2 (2009 నుండి 2014)లో 7.39% ఉంది. ఎన్‌డిఏ పాలించిన మొదటి నాలుగేళ్ల సగటు 7.35% ఉంది. ఈ రిపోర్టు బయటకు రాగానే ప్రభుత్వం 'ఇవేమీ ఫైనల్ కావు, మంత్రిత్వశాఖ ఆమోదించలేదు' అనేసింది. తర్వాత ఆ శాఖ అంకెలు తారుమారు చేసి యుపిఏ హయాంలో తక్కువ వృద్ధి జరిగినట్లు చూపడానికి అప్పుడు 6.67% వృద్ధి కాగా, ఎన్‌డిఏ హయాంలో 7.35% వృద్ధి అయింది అని నివేదిక తయారు చేసి, దాన్ని నీతి ఆయోగ్ ద్వారా 2018 నవంబరులో విడుదల చేయించింది. దీనికి స్టాటిస్టిక్స్ కమిషన్ యాక్టింగ్ చైర్మన్ పిసి మోహనన్ అభ్యంతర పెట్టారు. ప్రభుత్వం ఆ అభ్యంతరాన్ని పట్టించుకోలేదు.
దీని తర్వాత నిరుద్యోగిత సర్వే అంశం వివాదాస్పదమైంది. స్టాటిస్టికల్ కమిషన్, గణాంకాల మంత్రిత్వ శాఖ కలిసి నిరుద్యోగిత గురించి తెలుసుకోవాలనుకుని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ని జులై 2017- జూన్ 2018 కాలానికి నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ సర్వే (పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే) నిర్వహించమన్నాయి. 2018 డిసెంబరు నాటికి వచ్చిన సర్వే రిపోర్టు చూస్తే పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు తేలింది. దాని ప్రకారం 2017-18 సం||లో సరాసరి నిరుద్యోగిత 6.1% (నగర ప్రాంతాల్లో 7.8%, గ్రామీణ ప్రాంతాల్లో 5.3%) ఉంది. అది 45 ఏళ్లలో గరిష్టం. ఆ రిపోర్టును అలాగే కమిషన్‌కు సమర్పించింది. దాన్ని పబ్లిక్‌కు విడుదల చేయమని మోహనన్ ఆదేశాలు యిచ్చారు. అయినా ఎన్నికలు రాబోతూండగా యిదెలా బహిరంగ పరుస్తామనుకున్న ప్రభుత్వ శాఖ దాన్ని దాచేసింది. దాంతో కమిషన్ స్వయంప్రతిపత్తిని ప్రభుత్వం హరిస్తోందంటూ, నిరసనగా జనవరి నెలాఖరులో యాక్టింగ్ చైర్మన్ మోహనన్, కమిషన్ సభ్యురాలు, దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ప్రొఫెసరు ఐన జెవి మీనాక్షి రాజీనామా చేశారు.
ప్రభుత్వం చలించలేదు. ఎన్నికలు అయిపోయి, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఎవరూ యింకేమీ చేయలేరు కదాన్న ధైర్యంతో ఐదు నెలల తర్వాత ఆ రిపోర్టును విడుదల చేశారు. ఆలస్యమెందుకైందో వివరణ ఏమీ లేదు. పైగా విడుదల చేసిన చీఫ్ స్టాటిస్టిషియన్ ప్రవీణ్ శ్రీవాస్తవ '45 ఏళ్లలో యిదే గరిష్టమంటూ గతంతో పోల్చడం సరి కాదు. దీనికి మనం అవలంబించిన విధానం (మాట్రిక్స్) వేరు, గతంలో ఉన్న విధానం వేరు.'' అంటూ వాదించారు. ఏం చేసినా గణాంక సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తే తమకు తలనొప్పే అనుకుంది ప్రభుత్వం. అందుకని మే 23న దేశమంతా ఎన్నికల ఫలితాల హడావుడిలో ఉండగా మంత్రిత్వ శాఖ ఒక ఆఫీసు ఆర్డరు ద్వారా సిఎస్‌ఓ (సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్), ఎన్‌ఎస్‌ఎస్‌ఓ (నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు) లను కలిపివేసి ఎన్‌ఎస్‌ఓ (నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్) గా చేసి, దాన్ని తన ఆధ్వర్యంలోకి తీసుకుని వచ్చేసింది.
ఆ ఎన్‌ఎస్‌ఓకు అధినేతగా ఆ శాఖలోని ఒక సెక్రటరీ ఉంటారు. ఈ విధంగా ఎన్‌ఎస్‌ఎస్‌ఓను రూపుమాపేశారు. అంతటితో ఆగలేదు, దానిలోని డేటా ప్రాసెసింగ్ డివిజన్ పేరుని డేటా క్వాలిటీ ఎస్యూరెన్స్ డివిజన్ (డిక్యూఎడి)గా పేరు మార్చి వ్యవహార శైలిలో మార్పులు తెచ్చారు. ఇకపై డేటాకు 'మెరుగులు' దిద్ది, ప్రభుత్వానికి అనుగుణంగా మార్చేసే ఉద్దేశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎకనమిక్ డేటాపై 'చేయి చేసుకుని' ప్రభుత్వానికి అనుగుణంగా మార్చి మసిపూసి మారేడుకాయ చేయడంతోనే గ్రీసులో ఆర్థిక సంక్షోభం వచ్చిందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి చర్యల వలన ప్రభుత్వం ప్రచురించే గణాంకాలను విశ్వసించని పరిస్థితి వస్తుందని నిపుణుల ఆవేదన.
ప్రస్తుత భారతంలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న అనేక ప్రభుత్వ సంస్థలు క్రమేపీ తమ ప్రాభవాన్ని కోల్పోయి, ప్రభుత్వ ఆధ్వర్యంలోకి వచ్చేస్తున్నాయి. గణాంక సంస్థలు కూడా ఆ జాబితాలో చేరుతున్నాయని తోచడానికి కారణం పైన చెప్పిన విలీనమే కాక, స్టాటిస్టిక్స్ కమిషన్‌లో నింపని ఖాళీలు. కమిషన్ చైర్మన్‌గా 2018 జులైలో ఆర్‌బి బర్మన్ రిటైరయ్యారు. అప్పణ్నుంచి ఎవర్నీ చైర్మన్‌గా నియమించలేదు. మోహనన్ యాక్టింగ్ చైర్మన్‌గా వ్యవహరిస్తూనే జనవరి నెలాఖరులో రాజీనామా చేశారు. సభ్యురాలు మీనాక్షి కూడా. ఇది ఐదున్నర నెలల తర్వాత జులై 15 న ఒక చైర్మన్‌ను, నలుగురు సభ్యులను వేశారు. చీఫ్ స్టాటిస్టిషియన్ ప్రవీణ్ శ్రీవాస్తవ, నీతి ఆయోగ్ ఉద్యోగి అమితాభ్ కాంత్ కొనసాగుతున్నారు. చైర్మన్‌గా వేసిన బిమల్ కుమార్ రాయ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌కి చీఫ్‌గా ఉండేవారు. ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చేసరికి 2015లో రిటైర్ కావడానికి రెండు నెలల ముందే తీసేశారు. ఇప్పుడీ విధంగా పెద్ద పోస్టే యిచ్చారు. ఈ కొత్త స్టాటిస్టిక్స్ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందో, ప్రభుత్వానికి వంత పాడుతుందో వేచి చూడాలి. (ఫోటో – మోహనన్, మీనాక్షి)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2019)
[email protected]