శాంతికాముకుల్లో క‌ట్టలు తెంచుకుంటున్న ఆగ్ర‌హం!

అమ‌రావ‌తి రెండో ద‌శ పాద‌యాత్ర ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య న‌డుస్తోంది. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వెల్లి వ‌ర‌కూ పాద‌యాత్ర చేప‌డ‌తామ‌ని, అనుమ‌తి ఇవ్వాల‌ని కోరిన‌పుడు పోలీస్ అధికారులు నిరాక‌రించారు. ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన ఉత్త‌రాంధ్ర‌కు అమ‌రావ‌తి…

అమ‌రావ‌తి రెండో ద‌శ పాద‌యాత్ర ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య న‌డుస్తోంది. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వెల్లి వ‌ర‌కూ పాద‌యాత్ర చేప‌డ‌తామ‌ని, అనుమ‌తి ఇవ్వాల‌ని కోరిన‌పుడు పోలీస్ అధికారులు నిరాక‌రించారు. ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన ఉత్త‌రాంధ్ర‌కు అమ‌రావ‌తి పాద‌యాత్ర చేప‌ట్ట‌డం అంటే రెచ్చ‌గొట్ట‌డ‌మే అని పోలీస్ అధికారులు భావించారు. అందుకే అనుమ‌తి నిరాక‌రిస్తే… న్యాయ‌స్థానానికి వెళ్లి అనుకున్న‌ది సాధించుకున్నారు.

ప్ర‌స్తుతం పాద‌యాత్ర సాగుతూ వుంది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్ర‌కు పాద‌యాత్ర చేరువ అవుతున్న త‌రుణంలో తీవ్ర నిర‌స‌న‌లు ఎదుర‌వుతున్నాయి. త‌ణుకులో ఏం జ‌రిగిందో చూశాం. అక్క‌డ మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా భారీ ర్యాలీ, బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. మూడు రాజ‌ధానులే ముద్దు అని నిన‌దించారు. అదే స‌మయంతో అమ‌రావ‌తి పాద‌యాత్ర‌కు నల్ల జెండాలు చూపి త‌మ నిరస‌న ప్ర‌క‌టించారు.

తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలులో అమ‌రావ‌తి పాద‌యాత్ర‌కు భారీ నిర‌న‌స సెగ త‌గిలింది. భారీ సంఖ్య‌లో జ‌నం రోడ్ల‌పైకి వ‌చ్చి అమ‌రావ‌తి పాద‌యాత్రికుల‌కు త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేశారు. రియ‌ల్ ఎస్టేట్ వ‌ద్దు, ఆంధ్రా స్టేట్ ముద్దు; టీడీపీ బినామీలు గో బ్యాక్‌; వికేంద్రీక‌ర‌ణ ముద్దు, ప్రాంతాల మ‌ధ్య చిచ్చు వ‌ద్దంటూ ప్ల‌కార్డులు, ఫ్లెక్సీలు చేత‌బూని నినాదాల‌తో హోరెత్తించారు. గుడివాడ‌లో మాదిరిగా తొడ‌లు కొట్ట‌లేక‌పోయారు.

ముందుకు పోయేకొద్ది వికేంద్రీక‌ర‌ణకు మ‌ద్ద‌తుగా, అలాగే అమ‌రావ‌తికి వ్య‌తిరేకంగా ఆ ప్రాంత ప్ర‌జానీకం భారీగా నిర‌స‌న తెలిపే ప్ర‌మాదం వుంద‌ని తాజా ప‌రిణామాలు హెచ్చ‌రిస్తున్నాయి. ఉత్త‌రాంధ్ర‌లో అమ‌రావ‌తి పాద‌యాత్ర‌ను అడుగు పెట్ట‌నివ్వ‌మ‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. ఇది పాద‌యాత్ర కాదు, త‌మ ప్రాంతంపై దండ‌యాత్ర అని వారు ప‌దేప‌దే చెబుతున్నారు.

ఇదే అమ‌రావ‌తి మొద‌టి ద‌శ పాద‌యాత్ర కూల్‌గా సాగింది. అమ‌రావ‌తి నుంచి తిరుప‌తి వ‌ర‌కూ పాద‌యాత్ర చేప‌ట్టిన సంగతి తెలిసిందే. రాయ‌ల‌సీమ‌కు క‌నీసం హైకోర్టు కూడా వ‌ద్ద‌నే డిమాండ్‌తో చేస్తున్న పాద‌యాత్ర‌కు సీమ ప్ర‌జానీకం నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతుంద‌ని అమ‌రావ‌తి పాద‌యాత్రికులు ఆందోళ‌న చెందారు. కానీ అలాంటిదేమీ జ‌ర‌గలేదు. ఏ ఒక్క‌రూ అడ్డుకోలేదు. నిర‌స‌న గ‌ళాలు వినిపించ‌లేదు. రాయ‌ల‌సీమ అంటే గూండాలు, రౌడీలు అని ఇదే టీడీపీ, అమ‌రావ‌తి పాద‌యాత్ర నిర్వాహ‌కులు ప‌దేప‌దే విమ‌ర్శించిన సంద‌ర్భాలున్నాయి.

అదేంటో గానీ, త‌మ ప్రాంతంపైకి దండ‌యాత్ర‌గా వ‌స్తున్నార‌ని రౌడీలు, గూండాలు అన‌లేదు. ఉత్త‌రాంధ్ర, కోస్తా ప్ర‌జానీకం అంటే సౌమ్యుల‌ని, శాంతికాముకుల‌ని పేరు. వారే ఇప్పుడు అమ‌రావ‌తి పాద‌యాత్ర‌ను తీవ్రంగా నిర‌సిస్తున్నారు. అలాంటి వారికి కోపం వ‌చ్చిందంటే ఎంతగా క‌డుపు మంట ర‌గిల్చారో అర్థం చేసుకోవ‌చ్చు.