ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్డా కడప గడ్డపై టీడీపీ యువ కిషోరం నారా లోకేశ్ అడుగు పెట్టనున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన సోషల్ మీడియా మత్తు నుంచి తేరుకుని, నేరుగా కార్యక్షేత్రానికి వెళుతున్నారు. లోకేశ్‌లోని ఈ మార్పుపై టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు. టీడీపీ ఇన్‌చార్జ్ ఇంటి వద్దకెళ్లి ధర్నాతో పాటు టీడీపీ స్థానిక నాయకులపై వైసీపీ నేతలు దాడికి పాల్పడినట్టు ప్రధాన ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇది చాలదన్నట్టు టీడీపీ ఇన్‌చార్జ్‌పై అక్రమ కేసుతో పాటు అరెస్ట్ కూడా చేసి జైల్లో పెట్టారని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అయితే ఆయన ప్రకటన, సానుభూతి వరకే పరిమితం కాలేదు.
కడప సెంట్రల్ జైల్లో ఉన్న జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పరామర్శించేందుకు లోకేశ్ శనివారం కడప వెళ్లనున్నారు. ప్రవీణ్‌ను వెంటనే విడుదల చేయాలని ఇప్పటికే లోకేశ్ డిమాండ్ చేశారు. తమ పార్టీ నాయకులకు చిన్న సమస్య వచ్చినా నేరుగా ఆ పార్టీ ముఖ్య నాయకులే వెళుతుండడం టీడీపీలో భరోసా నింపుతోంది.
ఏమైనా సమస్య ఎదురైతే పార్టీ అండగా వుంటుందనే నమ్మకం నింపేందుకు లోకేశ్, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. లోకేశ్ కడపకు వెళ్లనున్న నేపథ్యంలో ఆ జిల్లా శ్రేణులు భారీగా తరలివెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం.