కేసీఆర్ జాతీయ పార్టీని ఎవరూ పట్టించుకోవడంలేదా?

జాతీయ రాజకీయాల హడావుడి కేవలం సీఎం కేసీఆర్ కే పరిమితమైనట్లుగా కనబడుతోంది. ఆయన బీఆర్ఎస్ పార్టీకి స్పందన కరువైనట్లుగా కనబడుతోంది. తాను బీఆర్ఎస్ ను ప్రకటించగానే వివిధ రాష్ట్రాలలోని నాయకులు పరుగులు తీస్తూ తన…

జాతీయ రాజకీయాల హడావుడి కేవలం సీఎం కేసీఆర్ కే పరిమితమైనట్లుగా కనబడుతోంది. ఆయన బీఆర్ఎస్ పార్టీకి స్పందన కరువైనట్లుగా కనబడుతోంది. తాను బీఆర్ఎస్ ను ప్రకటించగానే వివిధ రాష్ట్రాలలోని నాయకులు పరుగులు తీస్తూ తన దగ్గరకు వస్తారని ఆయన ఆనుకొని ఉండొచ్చు. గతంలో కూడా థర్డ్ ఫ్రంట్ అంటూ ఈయనే అన్ని రాష్ట్రాల్లో కాలికి బలపం కట్టుకొని తిరిగాడు తప్ప ఈయన దగ్గరకు పెద్దగా ఎవరూ రాలేదు. కేసీఆర్ దగ్గరకు వచ్చి కలుసుకొని మాట్లాడింది కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తప్ప మరొకరు వచ్చిన దాఖలాలు లేవు.

కొంత కాలం కిందట రైతు నాయకుల పేరుతో ఉత్తరాది నుంచి వచ్చి కొందరు కలుసుకున్నారు. అప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ తెగ ఊగిపోయారు. భారత రాజకీయ రంగాన్ని ప్రభావితం చేయడానికే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నానని, బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడవడానికి దేశవ్యాప్తంగా చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయని విజయదశమి రోజు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఏ పార్టీ ముందుకు వచ్చినట్లు కనబడటంలేదు. కేసీఆర్ ఆవేశానికి, అంచనాకు తగిన దృశ్యం కనబడటంలేదు. బీఆర్ఎస్ ప్రకటన తరువాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినా ఆయన్ని కలుసుకోవడానికి ఏ ఒక్క నాయకుడుగానీ, నాయకురాలుగాని రాలేదని సమాచారం.

కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికి ఢిల్లీ చేరి మూడు రోజులు అయింది. టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ అని తీర్మానం చేసిన రోజున జెండా, అజెండాల గురించి కేసీఆర్ వివరిస్తారని మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ తర్వాత ఆయన  మీడియాతో మాట్లాడలేదు. అసలు ఇప్పటి వరకూ మాట్లాడలేదు. బీఆర్ఎస్ గురించి ఎలాంటి సమాచారమూ ఆయన నోటి నుంచి ప్రజలకు చెప్పలేదు. కేసీఆర్ ఎందుకీ గోప్యత పాటిస్తున్నారు? మూడు రోజులుగా ఢిల్లీలో సీక్రెట్‌ సమావేశాల వెనుక ఏ వ్యూహం దాగి ఉంది ? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

తెలంగాణ రాష్ట్ర సమితిని… భారత రాష్ట్ర సమితిగా  మార్చాలని తీర్మానం చేసి ఈసీకి ఇచ్చారు. ఇక ఎన్నికల సంఘం మిగతా ప్రక్రియ పూర్తి చేస్తుంది. అయితే ఇలా తెలంగాణ ప్రజలు రెండు సార్లు పట్టం కట్టిన  పార్టీ పేరును మారుస్తున్నట్లుగా… కేసీఆర్ ఇంకా తన నోటి ద్వారా ప్రజలకు చెప్పలేదు. తీర్మానం చేసినరోజున మీడియాతో మాట్లాడతారనుకున్నా జరగలేదు. జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీలో మీడియాతో మాట్లాడతారని అనుకుంటున్నారు. కానీ ఢిల్లీ చేరి మూడు రోజులు అయినా ఇంత వరకూ ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కనీసం ప్రెస్ మీట్ ఉంటుందని కూడా ఎవరూ చెప్పడంలేదు. కేసీఆర్ ఎందుకింత గోప్యత పాటిస్తున్నారన్నది టీఆర్ఎస్ వర్గాలకు అంతు చిక్కడం లేదు.

ములాయం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యూపీ వెళ్లిన కేసీఆర్ ఆ తర్వాత ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట కవిత, సంతోష్‌ కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ అధికారికంగా ఎవరితోనూ భేటీ  అయినట్లుగా సమాచారం లేదు. మూడు రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఓ రోజు బీఆర్ఎస్ కోసం లీజుకు తీసుకున్న భవనాన్ని.. మరో రోజు సొంతంగా కడుతున్న భవనాన్ని పరిశీలించారు. మిగతా సమయాల్లో ఆయన ఎవరితో భేటీ అవుతున్నారో టీఆర్ఎస్ వర్గాలు క్లారిటీ ఇవ్వడం లేదు. ఆయన చాలా బిజీగా ఉన్నారని.. ఖాళీగా మాత్రం లేరని చెబుతున్నారు. బీఆర్ఎస్‌ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.

ఢిల్లీలో ఉత్తరాదికి చెందిన కొంత మంది రాజకీయేతర ప్రముఖులతో మాట్లాడుతున్నారని వారిని పార్టీలో చేర్చుకుని బాధ్యతలిచ్చేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. భారత్ రాష్ట్ర సమితికి ఈసీ ఆమోదం తెలిపిన తర్వాత కేసీఆర్ అందరికీ క్లారిటీ ఇస్తారని.. ఇంకా అధికారికంగా పేరు మారకుండానే అన్నీ చెప్పడం మంచిది కాదని ఆగినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇపుడున్న పరిస్థితుల్లో జాతీయ పార్టీ సాధ్యమా? ఒక బలమైన ప్రాంతీయ నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ 'తెలంగాణ ప్రాంతీయ ఐడెంటిటీ' నుంచి బయటపడి జాతీయ నాయకుడిగా ఇతర ప్రాంతీయ రాజకీయాల్లో గుర్తింపు పొందగలరా? అనే  చర్చ  మొదలైంది. 

దేశంలో ఒక జాతీయపార్టీ అవతరించక చాలా కాలమైంది. స్వతంత్రం వచ్చాక భారతదేశ జాతీయ పార్టీల చరిత్ర తీసుకుంటే బీజేపీ తర్వాత కొత్త జాతీయ పార్టీలేవీ ఏర్పడలేదు. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ పేర్లలో 'ఆల్ ఇండియా' అని పేరు పెట్టుకున్నా(ఏఐఏడీఎంకే, ఏఐఎమ్ఐఎమ్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్) అవేవీ అఖిల భారత పార్టీలు కాలేకపోయాయి. ఎన్నికల కమిషన్ నిర్వచనం ప్రకారం రెండు మూడు రాష్ట్రాలలో పోటీ చేసో, ఒకటి అరా సీట్లు గెలిచో నేషనల్ పార్టీ హోదా సంపాదించాకున్నాయి గాని, అసలైన అఖిల భారత పార్టీలుగా విస్తరించలేకపోయాయి. 

మరొక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి ప్రాంతీయ పార్టీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీయే. ఎన్నికల కమిషన్ నిర్వచనం ప్రకారం ఇపుడు ఇండియాలో జాతీయ పార్టీ హోదా పొందిన ప్రాంతీయ పార్టీల ఆనవాళ్లు సొంత రాష్ట్రం బయట నామమాత్రమే. మరొకవైపు కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం కుంచించుకుపోయి జాతీయ పార్టీ హోదా కోల్పోయే ప్రమాదం అంచుల దాకా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రెండు అఖిల భారత పార్టీలలో ఒకటి 1885లో పుట్టిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రెండోది ఆ తర్వాత దాదాపు వందేళ్లకు 1980లో ఉనికిలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ. 

1885-1980 మధ్య దాదాపు శతాబ్ద కాలంలో అనేక జాతీయ పార్టీలు వచ్చాయి, పోయాయి. సోషలిస్టు పార్టీలు, భారతీయ జనసంఘ్, ముస్లిం లీగ్, కొన్ని కిసాన్ పార్టీలు, రకరకాల వామపక్షాల పార్టీలు అఖిల భారత స్థాయిలో ప్రాచుర్యం పొందినా, అవి కొన్ని సంవత్సరాల తర్వాత రూపాంతరం చెందడమో లేక రూపు మాసిపోవడమో జరిగింది. ఇంత సువిశాల భారతదేశంలో రెండేరెండు జాతీయ పార్టీలుండటం, అందునా ఒకటి పతనావస్థలో ఉండటం ఇపుడు చూస్తున్నాం. ఈ లెక్కన మరొక జాతీయ పార్టీకి చోటు ఉన్నట్లు అనిపిస్తుంది. కేసీఆర్ ప్రయత్నం ఈ కోణం నుంచి చూస్తే సరైన ప్రయోగమే అనిపిస్తుంది. కానీ ఇది విజయవంతం అవుతుందా?