దేశంలో రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉందని నంబర్లు స్పష్టం చేస్తూ ఉన్నాయి. లాక్ డౌన్ మినహాయింపులు మొదలైన దశలో దేశ వ్యాప్తంగా రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యేవి. ఆ నంబర్లను చెప్పి అప్పట్లోనే మీడియా జనాలను హడలు కొట్టింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆ నంబర్లు పెరుగుతూ పోతున్నాయి. దేశంలో రోజుకు వెయ్యి కేసులు పెరగడమే భయాందోళనగా పేర్కొన్న అంశం దగ్గర నుంచి ఇప్పుడు దేశ వ్యాప్తంగా రోజుకు 10 వేల పై స్థాయిలో కేసులు పెరుగుతున్న దశకు వచ్చేసింది కరోనా వ్యాప్తి.
లాక్ డౌన్ మినహాయింపులు కొనసాగుతూ ఉన్నాయి. మళ్లీ లాక్ డౌన్ అంటూ మీడియా భయపెడుతూ ఉంది కానీ, కేంద్రం ఇప్పటి వరకూ ఆ సంకేతాలను ఇవ్వలేదు. ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో ఏం మాట్లాడతారనేదీ ఆసక్తిదాయకమైన అంశం. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ అంటే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు. చాలా రకాల పరిశ్రమలు పూర్తిగా మూతపడటానికి తదుపరి లాక్ డౌన్ కారణం కాగలదు. ఇప్పటికీ దేశంలో కరోనా వ్యాప్తి కొన్ని ప్రాంతాల్లోనూ, కొన్ని రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాటికి లాక్ డౌన్ పరిమితం చేయవచ్చు. అలా కాకుండా మళ్లీ దేశం మొత్తానికీ లాక్ డౌన్ అంటే.. గోటికి ఇబ్బంది కలిగితే శరీరానికంతా బ్యాండేజ్ చుట్టడమే అవుతుంది. ఇక మోడీ ఏం డిసైడ్ చేస్తారో!
ఆ సంగతలా ఉంటే.. ఇండియాలో కరోనా పీక్ స్టేజ్ నవంబర్ మధ్యలో ఉంటుందని ఐసీఎంఆర్ ఫండెడ్ సర్వే ఒకటి అంచనా వేస్తోందట. నవంబర్ నెల సమయానికి ఇండియాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతాయనేది దాని అంచనా. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి సేవలను అప్పటికి అనేక రెట్లు పెంచుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది ఆ సర్వే. అయితే ఈ అధ్యయనం ఇప్పటికే వేసిన అంచనాలు కొంత వరకూ మాత్రమే నిజం అయ్యాయట. ఇది వరకూ ఈ అధ్యయన అంచనాల ప్రకారం..లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత దేశంలో ఈ పాటికే మొత్తం కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షల స్థాయిలో ఉండాల్సిందట. కానీ ఇప్పటి వరకూ ఇండియాలో మూడు లక్షల స్థాయిలో కేసులున్నాయని ప్రభుత్వాల గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు ఏ వైరస్ కూడా దీర్ఘకాలం ప్రభావం చూపలేదని, అది క్రమంగా మనుషుల్లోకి భాగం అయిపోతుందని, కరోనా కూడా అంతేనని.. రానున్న రోజుల్లో దాని ప్రభావం గణనీయంగా తగ్గుతుందని కొన్ని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. ఎవరి అంచనాలు వారివిలా ఉన్నాయి!