ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు. కేంద్రం హెచ్చరించినా వినలేదు. స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖలు రాసినా లైట్ తీసుకున్నారు. కరోనా పరీక్షలపై తెలంగాణ సర్కార్ తనదైన విధానాన్నే కొనసాగించింది. అత్యల్ప పరీక్షలతో నెట్టుకొచ్చింది. ఓవైపు వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ వైఖరి మారలేదు. ఎట్టకేలకు ప్రభుత్వ విధానంలో మార్పు వచ్చింది.
కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 30 నియోజకవర్గాల పరిథిలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. రాబోయే వారం, పది రోజుల్లో ఈ నియోజకవర్గాల్లో 50వేల పరీక్షలు చేయబోతున్నారు.
అయితే ఈ సంఖ్య కూడా తక్కువే. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుంటే కనీసం లక్షన్నర పరీక్షలైనా చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సంగతి పక్కనపెడితే, కనీసం ఇప్పటికైనా కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి విషయం. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను ప్రభుత్వం మరింత పెంచుతుందనే ఆశిద్దాం.
మరోవైపు కీలకమైన ప్రైవేట్ ల్యాబ్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ పై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా పరీక్షలు చేసేందుకు, ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనాకు ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు అవసరమైన గైడ్ లైన్స్ తయారుచేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు.
మొత్తమ్మీద ప్రతిపక్షాలు, కేంద్రం వల్ల కాని పని కరోనా వల్ల అయింది. అలా కేసీఆర్ ను కరోనా దారిలోకి తెచ్చింది.