దేశంలో కరోనా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ కూ రెండో డోస్ వ్యాక్సిన్ కూ కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవధిని మెయింటెయిన్ చేస్తున్నట్టుగా ఉంది. దాదాపు మూడు నెలల వ్యత్యాసంలో రెండో డోసు వ్యాక్సిన్ వేస్తున్నట్టుగా ఉన్నారు. కనీసం 84 రోజుల వ్యత్యాసాన్ని పాటిస్తున్నారు. అయితే కొందరు పరపతి ఉన్న వాళ్లు అంతకన్నా మునుపే రెండో డోస్ టీకా పొందుతున్నారనే వార్తలూ వస్తున్నాయి. అసలు రెండు డోసులకు మధ్య వ్యవధి విషయంలోనే రకరకాల అభిప్రాయాలు, విమర్శలు ఉన్నాయి.
అవసరానికి తగ్గట్టుగా టీకాల లభ్యత లేకపోవడం వల్లనే రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచారనే విమర్శలు వచ్చాయి. మొదట్లో ఆరు వారాల వ్యవధిలో రెండు టీకాలు ఇచ్చిన మాట వాస్తవమే. నాలుగైదు వారాల తర్వాతే అప్పుడు రెండో టీకాను ఇచ్చారు అనేక మందికి. అయితే ఆ తర్వాత ప్రజలందరూ టీకాల మీద దృష్టి పెట్టిన సమయానికి.. రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచారు. అంతర్జాతీయ అధ్యయనాలు, సర్వేలు.. రెండు డోసుల మధ్యన వ్యవధిని పెంచాలంటూ చెప్పాయనే విషయం అప్పుడు చర్చకు వచ్చింది.
రెండు డోసుల మధ్యన వీలైనంత వ్యవధి ఉండటం.. మంచిదే అని, దాని వల్ల కరోనాను ఎదుర్కొనగల యాంటీబాడీలు బాగా వృద్ధి చెందుతాయనే మాటా వినిపించింది. వీటిల్లో ఏది నిజమో, ఏది కల్పితమో కానీ.. తాజాగా వినిపిస్తున్న మరో వార్త, దేశంలో సకాలంలో రెండో డోసు పొందలేకపోయిన వారి సంఖ్య కోటిన్నరకు పైగా ఉందనేది!
దాదాపు మూడు నెలల కిందట తొలి డోసు వ్యాక్సిన్ ను పొంది, ఈ పాటికే రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉండి, ఆ మేరకు వ్యాక్సిన్ పొందలేకపోయిన వారి సంఖ్య 1.6 కోట్లు అట! కేంద్రం పెట్టిన వ్యవధి ప్రకారం చూసినా వీళ్లందరూ ఈ పాటికి రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందట. అయితే.. వీరంతా ఇప్పుడు రెండో డోస్ మిస్సింగ్ జాబితాలో ఉన్నారు.
ఇంతకీ దీనికి కారణం ఏమిటి? అంటే.. ఒకటి కాకపోవచ్చు! కొంతమందికి ఒక డోసు వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా కరోనా వచ్చింది. కరోనా పాజిటివ్ గా తేలిన తర్వాత… నయం అయినా, ఆ తర్వాత రెండో డోసు వ్యాక్సిన్ పొందడానికి వ్యవధిని పాటించాలని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో… ఇలాంటి వారు రెండో డోసు కు ఎగబడే పరిస్థితి లేదు! ఇలాంటి వారి సంఖ్య కూడా గణనీయంగా ఉండవచ్చు.
అలాగే ఫస్ట్ డోసు తర్వాత.. కొందరికి కరోనా భయం తగ్గిపోయి ఉండవచ్చు. మళ్లీ కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయంటే తప్ప వీరు మేల్కొనకపోవచ్చు. అలాగే.. ఫస్ట్ డోస్ పడినప్పుడు కొందరికి జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి గట్టిగానే వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అప్పుడు ఇబ్బంది పడిన నేపథ్యంలో.. రెండో డోసు పట్ల వారిలో విముఖత ఉండవచ్చు. ఇక రెండో డోసు లభ్యత లేక కొంతమంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోకపోయి ఉండవచ్చు కూడా!
ప్రధానంగా ఇలాంటి కారణాల వల్లనే ఒక డోసు వ్యాక్సినేషన్ పొందిన వారు, రెండో డోసుకు దూరంగా ఉండవచ్చు. అయితే ప్రభుత్వాలు ఈ విషయం మీదా దృష్టి సారిస్తున్నాయి. రెండో డోసుకు సమయం ఆసన్నమయినప్పుడు.. ఫోన్ కాల్స్ చేసి మరీ, వ్యాక్సిన్ వేయించుకోవాలని అలర్ట్ చేస్తున్నాయి.
కంప్యూటరైజ్డ్ కాల్స్ మొదటగా వస్తున్నాయి, వాటికి స్పందన లేనప్పుడు స్థానిక వైద్య సిబ్బంది-అధికారుల నుంచి కూడా కాల్స్ చేయించి, రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోమని చెబుతున్నారు. మరి ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా ఏకంగా కోటిన్నర మంది వ్యాక్సిన్ రెండో డోసుకు దూరంగా ఉండటం గమనార్హం. అయినా.. వీళ్లందరినీ అలర్ట్ చేసి, వ్యాక్సిన్ అందుబాటులో లేకపోతే ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ప్రభుత్వాలపై అదనంగా పడింది!