యోగం, సుడి అనే మాటలు మనం తరచుగా అంటుంటాం. వింటుంటాం. దేనికైనా యోగం ఉండాలిరా అంటుంటారు కొందరు. ఎవరికైనా మంచి ప్రయోజనం కలిగిందనుకోండి వాడికి సుడి తిరిగిందని అంటారు. హుజూరాబాద్ కు ఉప ఎన్నిక పుణ్యమా అని ఆ నియోజకవర్గం దశ తిరిగింది.
అక్కడ దళితులకు వారు ఎన్నడూ ఊహించని యోగం దళితబంధు రూపంలో పట్టింది. ఇతర నియోజకవర్గాల వారు అసూయ పడేంతగా ఆ నియోజకవర్గానికి నిధుల వర్షం కురుస్తోంది. దళితులకు నిధులు సరే. హుజూరాబాద్ లో అభివృద్ధి పనులకు కూడా గతంలో ఎన్నడూ లేనంత నిధులు కుమ్మరిస్తోంది సర్కారు.
ఒకప్పుడు ఒక చిన్న రోడ్డు వేయాలంటే ఏళ్ళూ పూళ్ళు పట్టేది. కానీ ఇప్పుడు అడిగిన వెంటనే పనులు అవుతున్నాయి. అడక్కపోయినా అవుతున్నాయి. ఇక హుజూరాబాద్ కు చెందిన నాయకులకు పదవుల యోగం పట్టింది. ఒరిజినల్ టీఆర్ఎస్ నాయకులకే కాదు. వేరే పార్టీల్లో నుంచి వచ్చి గులాబీ కండువా కప్పుకున్న నాయకులకు కూడా పార్టీలో చేరిన కొన్ని రోజులకే ఏదో ఒక పదవి కట్టబెట్టి ఖుషీ చేస్తున్నారు కేసీఆర్.
ఒక్క మాటలో చెప్పాలంటే నిధులపరంగా కావొచ్చు, పదవులపరంగా కావొచ్చు హుజూరాబాద్ సుడి తిరిగింది. ఇది పైకి కనబడకుండా చేస్తున్న ఓటుకు నోటు వ్యవహారంగా చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ మెదడుకు పనిచెబుతున్నారు.
గతంలో తన ఆలోచనలో కూడా లేని వారికి కీలక పదవులు అప్పగించాల్సి వస్తోంది. తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌ను నియమించారు కేసీఆర్. హుజురాబాద్‌కే చెందిన వకుళాభరణం.. గతంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. తాజా ఉప ఎన్నిక అభ్యర్థుల రేసులో టీఆర్ఎస్ తరపున ఆయన పేరు కూడా వినిపించింది.
అయితే ఆ అవకాశం చేజారినా.. ఇప్పుడు బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి దక్కింది. కాంగ్రెస్‌లో కోవర్టుగా పనిచేశాడని విమర్శలు మూటగట్టుకున్న కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు కేసీఆర్. టీఆర్ఎస్ లో చేరిన పది రోజులకే కౌశిక్ రెడ్డికి పదవి దక్కింది. ఇంతటి యోగం ఎవరికీ పడుతుంది ?
ఈటల ప్రధాన అనుచరుల్లో ఒకడైన బండా శ్రీనివాస్‌ను ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమించారు. ఈ పదవులు వీరికి కేసీఆర్ దయతోనో, ప్రేమతోనో ఇవ్వలేదు. తప్పనిసరై ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికే లేకపోతే ఈ పదవులు వీరికే ఇవ్వాలని ఏముంది ? వేరే జిల్లాలవారికి దక్కేవేమో. ఈ పదవులకు సరైన వ్యక్తులు కేసీఆర్ దృష్టిలో ఎవరున్నారో. కానీ ఈటలను ఓడించడం ఆయన లక్ష్యం కాబట్టి హుజూరాబాద్ వారినే ఏరికోరి ఎంపిక చేసుకున్నారు.
ఈటల పుణ్యమాని హుజురాబాద్ లీడర్లకు పదవుల పంట పండుతోంది. ప్రగతి భవన్ చుట్టూ ఏళ్ల కొద్ది ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండానే.. కనీస శ్రమ కూడా లేకుండానే.. పదవులే వచ్చి లీడర్ల ఒళ్లో వచ్చి వాలుతున్నాయి. వీరే కాదు.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే. ఎల్. రమణ, పెద్దిరెడ్డి వంటి పార్టీలు మారిన నేతలతో పాటు.. టీఆర్ఎస్ పార్టీకే చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు కీలక పదవులు ఉట్టిపై ఊరిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పదవులు వచ్చిన వారంతా ఈటల రాజేందర్ కు కృతజ్ఞులై ఉండాలి.