టీడీపీకి మాజీ మంత్రి కొడాలి నాని కొరకరాని కొయ్యగా మారారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లపై అభ్యంతరకర భాషలో నాని విరుచుకుపడడం దినచర్యగా మారింది. సీనియర్ ఎన్టీఆర్‌నే కాదు, జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా చంద్రబాబు వెన్ను పోటు పొడిచారని నాని అభియోగం. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో తండ్రీతనయుల్ని కొడాలి నాని ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కొడాలి నానికి టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ఏయ్ నాని ఖబడ్దార్ అని బుద్ధా వెంకన్న హెచ్చరించడం చర్చకు దారి తీసింది. జూనియర్ ఎన్టీఆర్‌తో కొడాలి నాని మైండ్‌గేమ్ ఆడుతున్నారన్నారు. కొడాలి నాని ట్రాప్లో తాము పడేది లేదన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను తమతో తిట్టించాలని అనుకుంటున్నట్టు వెంకన్న చెప్పారు. కానీ జూనియర్‌ను తామెందుకు తిడ్తామని ఆయన ప్రశ్నించడం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ నేతలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు, అంతకు ముందు మేనత్త భువనేశ్వరిపై ధూషణలకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ స్పందన టీడీపీ నేతలెవరికీ నచ్చలేదు. పైగా వైఎస్ రాజశేఖరరెడ్డిని గొప్ప నాయకుడిగా అభివర్ణించడం టీడీపీ నేతలకు గిట్టలేదు.
జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ నేతలు విమర్శలు చివరికి ఆ పార్టీకే నెగెటివ్ అవుతున్నాయి. దీంతో నాలుక్కరుచుకుని దిద్దుబాటు చర్యలను చేపట్టారు. ఆ కోణంలో చూస్తే… బుద్ధా వెంకన్న మేల్కొలుపు మాటలను అర్థం చేసుకోవచ్చు.