విశాఖ రాజధానికి జై అంటూ చోడవరానికి చెందిన ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇపుడు కాక రేపుతోంది. రాజధాని సెంటిమెంట్ లేదు అంటున్న వాళ్ళకు ఇది చెంపపెట్టు కావచ్చు. అదే సమయంలో యువత ఉద్రిక్తత్లకు లోను కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉద్యమకారుల మీద ఉంది అంటున్నారు.
చోడవరానికి చెందిన యువకుడు విశాఖ రాజధానికి జై అంటూ బైక్ ర్యాలీలో పాలు పంచుకున్నాడు. మధ్యలో ఆయన ఒక్కసారిగా ఆవేశానికి లోనై పెట్రోల్ ఒంటి మీద పోసుకుని బైక్ ని కూడా తగులబెట్టుకున్నాడు. సమయానికి నిర్వాహకులు స్పందించి యువకుడి ప్రాణాలకు ప్రమాదం లేకుండా కాపాడారు.
ఆసుపత్రికి వెళ్ళి యువకుడిని పరామర్శించిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ స్వార్ధపరుల ఉచ్చులో ఎవరూ పడకుండా శాంతియుతంగా విశాఖ రాజధాని ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరారు. విశాఖకు రాజధాని ఎంత అవసరమో ఈ యువకుడి ఘటన తెలియచేస్తోందని అన్నారు.
విశాఖ రాజధానికి సినీ మద్దతు కూడా పెరుగుతోంది. విశాఖ గర్జనకు గడువు దగ్గరపడుతున్న విశాఖ మన రాజధాని కావాలని అంతా పిలుపు ఇస్తున్నారు. సినీ కమెడియన్ జోగినాయుడు విశాఖ అందమైన నగరం, అందరి నగరం, ఇపుడు రాజధాని అయితే ఇంకా బాగుంటుంది. విశాఖ రాజధానిగా రావాలి. వస్తుంది అంటూ తన పూర్తి మద్దతు ప్రకటించారు.
ఇక చిన్న సినిమాల్లో కమెడియన్ గా రోల్స్ వేస్తే జబర్దస్త్ ఆర్టిస్టు అప్పారావు కూడా జై విశాఖ అంటున్నారు. ఈ నెల 15న తాను విశాఖ వెళ్తున్నానని, తనతో పాటు అంతా తరలిరావాలని అప్పారావు పిలుపు ఇచ్చారు. విశాఖ రాజధానికి మద్దతుగా జరిగే గర్జనలో అంతా పాలు పంచుకోవాలని అప్పారావు కోరారు.