ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పొదుపు సంఘాలకు సంబంధించి ఓ ఆర్పీ రూ.40 లక్షల అవినీతి ఆరోపణలే ప్రవీణ్‌ను జైలుకు పంపింది. ఉక్కు ప్రవీణ్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు బోగాల లక్ష్మినారాయణమ్మ కుమార్తె పురపాలక సంఘంలో ఆర్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్పీ రూ.40 లక్షల అవినీతికి పాల్పదిందంటూ కొందరు డ్వాక్రా మహిళలు ప్రొద్దుటూరులోని వసంతపేటలోని ఆమె ఇంటి వద్ద బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. టీడీపీ పట్టణ మహిళాధ్యక్షురాలి కుమార్తె కావడంతో ఆమెకు మద్దతుగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తన అనుచరులను పంపారు.
ఆ సమయంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఆర్పీ నుంచి పొదుపు సమాఖ్య పుస్తకాలను పోలీస్ అధికారులు తీసుకుని ఆడిట్ చేసి, ఆరోపణల విషయమై నిగ్గు తేల్చాలని సంబంధిత అధికారులను పోలీస్ అధికారులు ఆదేశించారు. మూడేళ్లకు సంబంధించి ఆడిట్ నిర్వహించాల్సి వుంది. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు నిజమైతే తానే రూ.40 లక్షలు చెల్లిస్తానని టీడీపీ ఇన్‌చార్జ్ ప్రవీణ్ స్పష్టం చేశారు.
దీంతో ఆయన ఇంటికి డ్వాక్రా మహిళలు, అధికార పార్టీకి చెందిన నేతలు గురువారం వెళ్లారు. అవినీతి సొమ్ము చెల్లించాలంటూ వైఎంఆర్ కాలనీలోని టీడీపీ ఇన్‌చార్జ్ ఇంటి వద్దకు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. దీనంతటికి ప్రవీణ్‌కుమార్‌రెడ్డే కారణమంటూ అర్ధరాత్రి ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. శుక్రవారం కడప మేజిస్ట్రేట్ ఎదుట హాజరు, అనంతరం ఆయన్ను అక్కడే ఉన్న సెంట్రల్ జైలుకు తరలించడం గమనార్హం. ఈ అరెస్ట్‌పై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.