ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే.. పదిమందితోనూ చెప్పిస్తే.. దానిని గోబెల్స్ ప్రచారం అంటారు. ఇది జర్మన్ నియంత హిట్లర్ అనుచరుడు కనిపెట్టిన సిద్ధాంతం. ప్రపంచమంతా ప్రాచుర్యం పొందిన సిద్ధాంతం. ప్రపంచంలో చాలామంది నాయకులు అనుసరించిన సిద్ధాంతం. అయితే ఈ రోజుల్లో ఈ సిద్ధాంతానికి కొంతవరకు కాలం చెల్లిందని, లేదా ఆ సిద్ధాంతాన్ని కొంచెం కొత్తగా అనుసరించడం తమకు చేతకావడం లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
‘తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు మితిమీరిపోతున్నాయి. జగన్మోహన రెడ్డి ప్రభుత్వంలో దాడులు విపరీతం అయ్యాయి. ఎవ్వరినీ బతకనివ్వడం లేదు’.. అనే మాటలను కాస్త ముందు వెనుకగా మార్చి, చంద్రబాబునాయుడు పదేపదే వల్లిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో మాటల కత్తులు దూసుకుని పోరాడుకునే పార్టీల కార్యకర్తల మధ్య ఆ సమయంలోనే విద్వేషాలు తారస్థాయికి చేరి ఉంటాయి. ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత.. ఎక్కడైనా చెదురుమదురు అల్లర్లు జరిగే అవకాశం సహజంగానే ఉంటుంది.
అలాంటివి జరిగినప్పుడు పార్టీలు ఒకరిమీద ఒకరు నిందలు వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం వారికి మైలేజీ ఇస్తుంది. అయితే గొడవలు జరిగిన తర్వాత వారాలూ నెలల తరబడి .. అదే పాట పాడుతూ ఉంటే… తమ పార్టీ వారందరితోనూ అదే పాట పాడిస్తూ ఉంటే ఏమనుకోవాలి? ఖచ్చితంగా ‘దాడులు జరగుతున్నాయి’ అనే ముసుగులో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడానికి ప్రజల్లో అనుమానాలు భయాలు కలిగించడానికి జరుగుతున్న గోబెల్స్ ప్రచారంగా భావించాల్సి ఉంటుంది. అలాంటి టెక్నిక్స్ లో చంద్రబాబు సిద్ధహస్తులు కూడా.
అయితే మరో సంగతి ఆయన గమనించాలి. రాజధాని నిర్మించేస్తున్నా అనే విషయంలో గానీ, పోలవరం డ్యాం ఇదిగో పూర్తయిపోయింది అని చెప్పడంలో గానీ… ఒకే అబద్ధాన్ని పదిమందితో పదిమార్లు చెప్పిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు. ఇవి వికటించి, ప్రజలు వాటిని గుర్తించి, ఎన్నికల్లో ఓడించారు.
కానీ.. చంద్రబాబునాయుడు మాత్రం ఆ సంగతిని గుర్తించడం లేదు. ఇప్పటికీ అదే సూత్రం ఫాలో అవుతున్నారు. దాడులు జరుగుతున్నాయి… అంటూ ప్రతి సందర్భంలో ఒకేమాట మాట్లాడుతున్నారు. అందరితోనూ అదే మాట్లాడిస్తున్నారు. ఇలాంటి గోబెల్స్ ప్రచారాలను ప్రజలు నమ్మే రోజులు పోయాయని ఆయన ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో?