రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించినప్పటి నుంచి, అడపాదడపా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు మరింత స్పష్టతను ఇస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను మరింత గట్టిగా సమర్థిస్తూ ఉన్నారు రజనీకాంత్. అందులో భాగంగా కశ్మీర్ అంశంలో వారిని ఆకాశానికెత్తేశారు. వారిని కృష్ణార్జునులుగా సంబోధించారు రజనీకాంత్.
కశ్మీర్ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ను సమర్థించారు రజనీకాంత్. అంతటితో ఆగకుండా మోడీ, అమిత్ షాలను కృష్ణార్జునులు అంటూ పొగిడారు. ఇలా బీజేపీకి మరింతగా దగ్గరవుతున్నారాయన. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో తమిళనాట తన పార్టీని బరిలో నిలపని రజనీకాంత్, బీజేపీకి అనుకూలంగా మాట్లాడారు. అయితే తమిళనాట బీజేపీ పప్పులు ఉడకలేదు.
అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని కనీసం ఒక్క ఎంపీ సీటును కూడా సంపాదించుకోలేకపోయింది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఆశలన్నీ రజనీకాంత్ మీదే ఉన్నాయి. ఆయనను ఇప్పటికే పలుసార్లు బీజేపీలోకి ఆహ్వానించారు. అయితే ఆయన సొంత పార్టీ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు.
అయితే పోటీ మాత్రం ఇప్పటి వరకూ చేయలేదు. తమిళనాడులో రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీ చేయవచ్చనే అంచనాలున్నాయి. అయితే అది కూడా ఆఖరి వరకూ స్పష్టత ఉండకపోవచ్చు. ఇంతలోనే రజనీకాంత్ కామెంట్లు బీజేపీ అనుకూలమైనవిగా సాగుతూ ఉన్నాయి.
ఆయన బీజేపీలోకి చేరవచ్చని లేదా తన పార్టీని పోటీలో పెట్టినా కమలం పార్టీతో పొత్తు ఖాయమనే అభిప్రాయాలకు మరింతగా ఆస్కారం ఏర్పడుతూ ఉందిప్పుడు.