కృష్ణమ్మ కరుణ.. పాతికేళ్ల తర్వాత!

దేశంలో అత్యధిక భారీ సాగునీటి ప్రాజెక్టులను కలిగిన నది కృష్ణానది. కృష్ణపై బహుళార్ధక సాధక ప్రాజెక్టులున్నాయి. కృష్ణను పూర్తిగా ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తున్నారు కన్నడీగులు. అయితే వారికి సాధ్యం అయ్యే పనికాదు. కృష్ణమ్మ దిగువ…

దేశంలో అత్యధిక భారీ సాగునీటి ప్రాజెక్టులను కలిగిన నది కృష్ణానది. కృష్ణపై బహుళార్ధక సాధక ప్రాజెక్టులున్నాయి. కృష్ణను పూర్తిగా ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తున్నారు కన్నడీగులు. అయితే వారికి సాధ్యం అయ్యే పనికాదు. కృష్ణమ్మ దిగువ ప్రాంతం మీద కూడా కరుణ చూపుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఈసారి రికార్డు స్థాయిలో సాగుతోంది కృష్ణా ప్రవాహం.

కృష్ణపై ఆధారపడిన అన్ని ప్రాజెక్టుల గేట్లనూ ఒకేసారి ఎత్తడం పాతికేళ్లలో ఇదే తొలిసారి అని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ప్రకటించారంటే ఈసారి ఉదృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టుల గేట్లను ప్రతియేటా రెండు మూడురోజుల పాటు ఎత్తితే అదే గగనం అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ప్రత్యేకించి శ్రీశైలం ప్రాజెక్టు వరకూ వచ్చేసరికి కృష్ణానది ప్రవాహంలో భారీ తనం కనుమరుగు అవుతూ వచ్చింది.

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను రెండు మూడు రోజులు ఎత్తితే అదే ఎక్కువ అన్నట్టుగా ఉండేది పరిస్థితి. అది కూడా రెండు మూడు గేట్లే. అయితే పన్నెండు గేట్లున్న శ్రీశైలం ప్రాజెక్టుకు ఇప్పుడు పది గేట్లను ఎత్తారు. నాగార్జున సాగర్ గేట్లను పూర్తిగా ఎత్తే సమయం వచ్చింది.

ఎగువన భారీ ప్రాజెక్టు ఆల్మట్టి నుంచి కింది వైపు నాగార్జున సాగర్ వరకూ అన్ని ప్రాజెక్టుల నుంచి భారీ వరద నీరు దిగువకు ప్రవహిస్తూ ఉంది. అన్ని ప్రాజెక్టుల గేట్లూ ఒకేసారి ఎత్తడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి అని గణాంకాలు చెబుతూ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కృష్ణానది నీటిపై ఆధారపడిన ప్రాంత వాసుల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఈ సారి నీరు పుష్కలంగా లభించనున్నాయి. ఇక రాయలసీమకు కూడా హంద్రీనీవా, ఇతర ఎత్తిపోతల పథకాలకు ప్రవాహం కొనసాగుతూ ఉండటం శుభసూచకం.

ప్రాంతీయ భాషల సినిమాలు అదుర్స్!