ఒరిజిన‌ల్ కు వంద‌ల కోట్లు, డ‌బ్బింగ్ బేల చూపులు!

త‌మిళ సినిమా పొన్నియ‌న్ సెల్వ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న స్థాయి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. థియేట‌ర్ల‌లో ఈ సినిమా షో దాదాపు ముగుస్తున్న నేప‌థ్యంలో దీని వ‌సూళ్లు సుమారు 400 కోట్ల రూపాయ‌ల‌ను అందుకున్నాయ‌ని ట్రేడ్…

త‌మిళ సినిమా పొన్నియ‌న్ సెల్వ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న స్థాయి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. థియేట‌ర్ల‌లో ఈ సినిమా షో దాదాపు ముగుస్తున్న నేప‌థ్యంలో దీని వ‌సూళ్లు సుమారు 400 కోట్ల రూపాయ‌ల‌ను అందుకున్నాయ‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రెండు భాగాలుగా విడుద‌ల కానున్న ఈ భారీ సినిమా తొలి భాగం ఇలా భారీ నంబ‌ర్ల‌తో మేక‌ర్ల‌ను సంతోష పెడుతూ ఉంది. ఫ‌స్ట్ పార్ట్ ఈ భారీ వ‌సూళ్ల‌ను సాధించ‌డంతో రెండో భాగం మేకింగ్ కు ఉత్సాహం ఉన్న‌ట్టే!

అయితే ఈ సినిమా 400 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించినా, అది ప్ర‌ధానంగా త‌మిళం నుంచి ద‌క్కిన డ‌బ్బే అని అనుకోవాలి. త‌మిళనాట ఈ సినిమా వ‌సూళ్ల ప్ర‌భంజ‌నాన్నే సృష్టించింది. అలాగే ఓవ‌ర్సీస్ లో కూడా త‌మిళుల నుంచి మంచి వ‌సూళ్ల‌ను పొందింది పొన్నియ‌న్ సెల్వ‌న్ 1. అయితే ఈ సినిమా డబ్బింగుల‌కు మాత్రం పెద్ద లాభ‌సాటి వ‌సూళ్లు ద‌క్క‌లేదు.

ఈ తమిళ సినిమాకు తెలుగుతో పాటు హిందీ కూడా ప్ర‌ధాన అనువాద మార్కెట్టే. అయితే తెలుగులో ఈ సినిమా పెద్ద ఆస‌క్తిని రేప‌లేక‌పోయింది. క‌థే అర్థం కాలేద‌నే ట్రోల్ ఈ సినిమా విష‌యంలో ఎక్కువ‌గా న‌డిచింది. చారిత్ర‌క సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌ను కొద్దోగోప్పో ఈ సినిమా ఆక‌ట్టుకుంది. దీంతో తెలుగులో ఓ మోస్త‌రు వ‌సూళ్లు మాత్ర‌మే ద‌క్కాయి. 

మ‌ణిర‌త్నం సినిమాల‌కు హిందీ కూడా మంచి మార్కెట్టే. అక్క‌డ ఫ్యాన్ ఫాలోయింగ్, ఐశ్వ‌ర్య‌రాయ్, ఏఆర్ రెహ‌మాన్ ప్ర‌భావం, సౌత్ సినిమాల‌కు ఇప్పుడు నార్త్ లో ఉన్న క్రేజ్, భారీ త‌నం.. ఇవ‌న్నీ క‌లెక్ష‌న్ల‌కు మార్గాలే. అయిన‌ప్ప‌టికీ.. హిందీలో ఈ సినిమాకు ద‌క్కిన వ‌సూళ్లు 22 కోట్ల రూపాయ‌లే అని తెలుస్తోంది. సౌత్ భారీ సినిమాలు హిందీ మార్కెట్లో వంద కోట్లు, అంత‌కు మించి టార్గెట్ ను పెట్టుకుని దిగుతున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో పొన్నియ‌న్ సెల్వ‌న్ 22 కోట్ల రూపాయ‌ల నెట్ వ‌సూళ్ల‌కు ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. 

పొన్నియ‌న్ సెల్వ‌న్ కు సంబంధించి తెలుగు, క‌న్న‌డ డ‌బ్బింగ్ వెర్ష‌న్లు కూడా బేల చూపులే చూశాయి స్థూలంగా. మొత్తానికి త‌మిళుల చ‌రిత్రకు సంబంధించిన సినిమా త‌మిళుల‌ను మాత్ర‌మే బాగా ఆక‌ట్టుకున్న‌ట్టుగా ఉంది.