జగన్ ప్రభుత్వంపై న్యాయస్థానంలో ఘాటు వ్యాఖ్యలు మళ్లీ మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో అసలు చట్టబద్ధ పరిపాలన సాగుతోందా? అని ప్రశ్నించడాన్ని మరిచిపోకనే, మరోసారి తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. రుషికొండపై తవ్వకాలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అక్కడికి ఎవరినీ ప్రభుత్వం అనుమతించడం లేదు.
మరోవైపు ప్రభుత్వం రుషికొండ మొత్తాన్ని తవ్వేస్తోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. నిజనిర్ధారణ కమిటీలను అటు వైపు వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రుషికొండ తవ్వకాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని హైకోర్టు అనుమాంచింది. తవ్వకాలపై ప్రభుత్వం ఏదో దాచేస్తోందని హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేయడం గమనార్హం. అభివృద్ధి పేరుతో కొండలను కొట్టేస్తున్నారని మండిపడింది.
కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయాలని కమిటీ వేస్తే అభ్యంతరం ఎందుకని ప్రభుత్వాన్ని ధర్మాసనం నిలదీసింది. 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే… 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆధారంగా గూగుల్ మ్యాప్‌లను న్యాయస్ధానానికి న్యాయవాదులు సమర్పించారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనలను ప్రభుత్వ న్యాయవాది కొట్టి పారేశారు.
హైకోర్టు అనుమతి ఇచ్చిన మేరకే తవ్వకాలు చేపట్టినట్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గూగుల్ మ్యాప్‌లు అబద్ధాలు చెబుతాయా అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రశ్నించారు. ప్రభుత్వం అఫిడవిట్ వేసిన తర్వాత నిజాలను నిగ్గుతేలుస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది.