టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేశ్ ఇప్పుడిప్పుడే అసలుసిసలు రాజకీయం మొదలు పెట్టారు. ఉత్తరాంధ్రను అధికార పార్టీ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో టీడీపీ బలంగా వుంది. గత ఎన్నికల్లో ఆశించిన సీట్లు ఆ పార్టీకి రాకపోవచ్చు. అయినంత మాత్రాన ఉత్తరాంధ్రలో టీడీపీకి ఏమీ లేదని, వైసీపీకి తిరుగులేదని భావిస్తే…. అంతకంటే అజ్ఞానం మరొకటి వుండదు.
తాజాగా ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ రాజధాని ఇస్తున్నామనే నినాదంతో ఉత్తరాంధ్రలో వైసీపీ బలపడాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందుకు కౌంటర్‌గా నారా లోకేశ్ రాయలసీమపై దృష్టి సారించారు. ఇవాళ హైదరాబాద్‌లో తన నివాసంలో రాయలసీమకు చెందిన విద్యార్థి, ఉద్యమ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా శ్రీబాగ్ ఒప్పందం అమలు, పూర్తిస్థాయి రాజధాని ఏర్పాటు, రాయలసీమలో విశ్వవిద్యాలయాల ప్రక్షాళన, ప్రాథమిక విద్యకు దూరమై బడిబయట ఉన్న లక్షలాది మంది పిల్లలకు సరైన విద్య, వైద్య సౌకర్యాలు, బతుకుదెరువు కోసం వలసలు వెళ్లడాన్ని నిరోధించడం తదితర అంశాలపై లోకేశ్‌తో వారు చర్చించినట్టు తెలిసింది.
అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిన మాట నిజమేనని, ఇదే సందర్భంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదని లోకేశ్ అన్నట్టు సమాచారం. రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించామని, అలాగే పులివెందులకు కూడా సాగునీళ్లు ఇచ్చామని విద్యార్థి, సీమ ఉద్యమ నాయకులతో లోకేశ్ అన్నట్టు తెలిసింది. మిగిలిన ప్రాంతాల కంటే రాయలసీమకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, అధికారంలోకి వస్తే వెనుకబడిన ప్రాంత పురోభివృద్ధికి సహకరిస్తామని లోకేశ్ అన్నట్టు తెలిసింది.
ఇదిలా వుండగా జగన్ ప్రభుత్వంపై రాయలసీమ వాసులు అసంతృప్తిగా ఉన్నారు. కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్నారు. కృష్ణా నదితో ఏ మాత్రం సంబంధం లేని విశాఖకు ఎందుకు తరలిస్తున్నారని నిలదీస్తున్నారు. సామాజిక సమీకరణల రీత్యా రాయలసీమలో వైసీపీ బలంగా ఉందని, ఏం చేసినా, చేయకపోయినా రాజకీయంగా నష్టమేమీ రాదని అధికార పార్టీ నేతలు భ్రమల్లో ఉన్నారు. దీంతో రాయలసీమ ఉద్యమకారులను, విద్యావంతుల అభిప్రాయాల్ని వైసీపీ పరిగణలోకి తీసుకోవడం లేదు.
దీన్ని గుర్తించిన లోకేశ్ రాయలసీమలో బలపడేందుకు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ఆపరేషన్ మొదలు పెట్టారు. రానున్న రోజుల్లో సీమ ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతుల్ని కలిసేందుకు కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. రాయలసీమ నుంచే తాను పాదయాత్ర మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నానని, తనదీ అదే ప్రాంతమని, తాను కూడా ఆ ప్రాంత శ్రేయోభిలాషినని నమ్మించేందుకు లోకేశ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.