జ‌డ వేసుకోవాల్సిందే, ఇండియాలోనూ ఉన్నారు తాలిబ‌న్లు!

తాలిబ‌న్లు.. తాలిబ‌న్లు అంటూ.. వాళ్ల‌పై మ‌నం ఒక రేంజ్ లో విరుచుకుప‌డిపోతున్నాం కానీ, మ‌న చుట్టుప‌క్క‌ల కూడా ఉన్నారు తాలిబ‌న్ల త‌ర‌హా మ‌నుషులు. ఆడ‌పిల్ల‌ల‌కు సంగీతం, నాట్యం నేర్ప‌కూడ‌దు అంటూ.. వెబ్ సైట్లు పెట్టి…

తాలిబ‌న్లు.. తాలిబ‌న్లు అంటూ.. వాళ్ల‌పై మ‌నం ఒక రేంజ్ లో విరుచుకుప‌డిపోతున్నాం కానీ, మ‌న చుట్టుప‌క్క‌ల కూడా ఉన్నారు తాలిబ‌న్ల త‌ర‌హా మ‌నుషులు. ఆడ‌పిల్ల‌ల‌కు సంగీతం, నాట్యం నేర్ప‌కూడ‌దు అంటూ.. వెబ్ సైట్లు పెట్టి మ‌రీ హోరెత్తించే కులాలు ఉన్నాయిక్క‌డ‌. అక్క‌డితో మొద‌లుపెడితే.. తాలిబ‌న్ల త‌ర‌హాలో లింగ వివ‌క్ష‌ను, మానసిక‌మైన హింస‌ను అమ‌లు ప‌రిచే వాళ్లు త‌ర‌చి చూస్తే బోలెడంత మంది వ్య‌వ‌స్థాగ‌తంగానే క‌నిపిస్తారు సువిశాల భార‌త‌దేశంలో.

అలాంటి వాటిల్లో ఒకటి.. బిహార్ లోని ఒక విద్యాల‌యం. సుంద‌రావ‌తి మ‌హిళా మ‌హా విద్యాల‌యం అట దాని పేరు. తమ స్కూలు అమ్మాయిల‌కు ఒక నియ‌మం పెట్టిందట ఆ సంస్థ‌. ఆడ‌పిల్ల‌లు త‌ప్ప‌నిస‌రిగా జ‌డ వేసుకునే ఆ విద్యాల‌యానికి హాజ‌రు కావాల‌ట‌. జ‌డ లేకుండా కాలేజీలోకి వ‌స్తే అనుమ‌తిచేది లేద‌ని ఆ విద్యాల‌యం బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

లూజ్ హెయిర్ తో కానీ, బేబీ క‌టింగ్ తో కానీ ఉండే అమ్మాయిల‌కు కాలేజీలోకి ప్ర‌వేశం లేద‌ని తేల్చి చెప్పింది. అలాగే యూనిఫామ్ త‌ప్ప‌నిస‌రి అని అంటోంది. యూనిఫామ్ అంటే.. అది అంద‌రి స‌మాన‌త్వం కోసం అనుకోవ‌చ్చు. మ‌రి జ‌డ త‌ప్ప‌నిస‌రి..అనే హెచ్చ‌రిక‌తో కూడిన నియ‌మంలో స‌మాన‌త్వం ఏముంది?

జుట్టు పెంచ‌డం, పెంచుకోక‌పోవ‌డం, క‌ట్ చేసుకోవ‌డం, గుండు కొట్టించుకోవ‌డం, లూజ్ హెయిర్.. ఇది ఏదైనా మ‌నిషి త‌న కంఫ‌ర్ట్ కోసం చేసుకునేదే. లూజ్ హెయిర్ ను స్టైల్ గా ప‌రిగ‌ణించేయ‌డ‌మేనా? అందులో ఆ వ్య‌క్తుల అభిరుచి సంగ‌తిని ప‌క్క‌న పెడితే, వారి కంఫ‌ర్ట్ ఏమీ ఉండ‌దా? ఆడ‌పిల్ల‌లు అయినంత మాత్రానా త‌ప్ప‌నిస‌రిగా జుట్టు క‌ట్టాల్సిందేనా?

లేక‌పోతే స్కూల్లోకి రానీయ‌రా?  తాలిబ‌న్లు కూడా ఇలాంటి నియ‌మాలే పెడుతున్నారు. బిగుతు దుస్తులు ధ‌రించ‌కూడ‌ద‌ని, బుర‌ఖాలు తీయ‌కూడ‌ద‌ని… ఆల్రెడీ మ‌న ద‌గ్గ‌ర కూడా అమ్మాయిలు జీన్స్ ధ‌రించడాన్ని ఆక్షేపించే మ‌త ప్ర‌వ‌చ‌న కారులు, రాజ‌కీయ నేత‌లు.. బోలెడంత మంది ఉన్నారు. ఇప్పుడు జ‌డ వ‌ర‌కూ వ‌చ్చారు. ఆడ‌పిల్ల‌ల‌కు అడ్డ‌మైన  ఆంక్ష‌ల‌ను పెట్ట‌డంలో.. తాలిబ‌న్ల‌కు వీళ్లు కూడా పెద్ద తీసిపోయేలా లేరు!