నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఇంకా నామినేషన్ల పర్వం సాగుతుండగానే బీజేపీ ఓటమి అంగీకరించింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు షరతులు ఆ పార్టీ ఓటమిని ప్రతిబింబిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల్లో నిలబడడమే గెలుపుగా ఏపీ బీజేపీ తృప్తి చెందుతోంది.
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏవో సంప్రదాయాల సాకుతో టీడీపీ, బీజేపీ మిత్రపక్షం జనసేన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నాయి. బీజేపీ మాత్రం పోటీకి సై అంది. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్‌ను ఎంపిక చేసింది. అభ్యర్థిని ప్రకటిస్తూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కామెడీ చేశారు.
కుటుంబ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు. ఇది మంచిదే. వైసీపికి దమ్ముంటే ఓట్లు కొనకుండా స్వచ్ఛందంగా ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసరడం కామెడీ కాక మరేంటి? దేశమంతా బీజేపీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయకుండానే గెలిచిందా? గత సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా డబ్బు ఖర్చు చేసిన పార్టీ బీజేపీ అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.
అదేంటోగానీ వీర్రాజు గారు ఏమీ తెలియని అమాయకుడిలా కథలు చెబుతున్నారు. వైసీపీకి చేతనయితే మంత్రులను ఎన్నికల ప్రచారంలోకి దింపకుండా కేవలం అభ్యర్థులే ప్రచారంలో పాల్గొని లక్ష మెజారిటీతో గెలుపొందాలని వీర్రాజు డిమాండ్ చేయడం గమనార్హం.
ప్రత్యర్థుల ప్రచారంతో బీజేపీకి పనేంటి? తెలంగాణ ఉప ఎన్నికల్లో కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు దిగి హోరాహోరీగా ప్రచారం చేసి గెలుపొందినట్టే …ఆత్మకూరులో కూడా అధికార పార్టీకి షాక్ ఇవ్వొచ్చు కదా? ఆ పని చేయాలని ఎందుకు భావించడం లేదో వీర్రాజు చెప్పాలి. పొంతన లేని షరతులతో అభాసుపాలు కావడం తప్ప ఒరిగేదేమీ వుండదని వీర్రాజు తెలుసుకుంటే మంచిది.