ఏపీ స‌ర్కార్ కోరి విమ‌ర్శ‌ల‌పాలు

ఏపీ స‌ర్కార్ కోరి వ్య‌తిరేక తెచ్చుకుంటున్న‌ది. అధికారులు, మంత్రి మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. టెన్త్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను జూన్ 4న విడుద‌ల చేస్తామ‌ని పాఠ‌శాల విద్యాశాఖ చెబుతూ వ‌చ్చింది. తీరా ఆ…

ఏపీ స‌ర్కార్ కోరి వ్య‌తిరేక తెచ్చుకుంటున్న‌ది. అధికారులు, మంత్రి మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. టెన్త్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను జూన్ 4న విడుద‌ల చేస్తామ‌ని పాఠ‌శాల విద్యాశాఖ చెబుతూ వ‌చ్చింది. తీరా ఆ స‌మ‌యానికి వాయిదా వేస్తున్న‌ట్టు చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్ప‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

శనివారం ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేస్తామ‌ని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్‌ దేవానంద్‌రెడ్డి మూడు రోజుల క్రితం ఒక ప్రకటనలో తెలిపారు. 

విజయవాడలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పాఠ‌శాల‌ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శనివారం ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. ఫ‌లితాల కోసం విద్యార్థులు, త‌ల్లిదండ్రులు వేచి ఉన్నారు. ఫ‌లితాలు విడుద‌ల చేయ‌గానే ఇంట‌ర్నెట్ నుంచి తీసుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారు.

చివ‌రి నిమిషంలో ప‌రీక్షా ఫ‌లితాల‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో అంతా ఉసూరుమ‌న్నారు. ఫ‌లితాల విష‌య‌మై  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణమనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

త‌న‌కు క‌నీస స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డంతో బొత్స మండిప‌డిన‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. ఏది ఏమైనా ఫ‌లితాల వాయిదాతో ప్ర‌భుత్వం అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.