వైద్యో నారాయణ హరీ అన్నారు పెద్దలు. అంటే వైద్యులు దైవంతో సమానమని అర్థం. ఇటీవల కాళ్ల నొప్పులు, వెన్నముక సమస్యలు, ఇతరత్రా ఆర్దోపెడిక్ సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో నిద్ర కరువై, బతుకుపై విరక్తితో నిత్యం చస్తూ బతుకుతున్న వాళ్ల సంఖ్య లెక్క పెట్టలేనంతగా ఉంది. మరోవైపు వైద్యం ఖరీదు కావడంతో, జబ్బుకంటే వైద్య ఖర్చులంటేనే వణికిపోయే పరిస్థితి.
అలాంటి వాళ్లకు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నెలకొల్పిన బర్డ్స్ ఆస్పత్రి పేద రోగుల పాలిట వరప్రసాదమైంది. ప్రధానంగా ఈ ఆస్పత్రి ఆర్దోపెడిక్ సమస్యలకు ప్రత్యేకంగా సేవలందిస్తోంది. కరోనా సెకెండ్ వేవ్ సమయంలో కోవిడ్ సెంటర్‌గా మార్చారు. కోవిడ్ క్రమంగా తగ్గి, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకున్నాయి. దీంతో కోవిడ్ సెంటర్‌ను ఎత్తేసి బర్డ్స్‌లో మునుపటి వలే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ తెల్లరేషన్‌కార్డు దారులకు ఉచిత వైద్యం అందిస్తుండడంతో పెద్ద ఎత్తున రోగులు వస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా రోగులు వస్తున్నారు. ప్రతిరోజూ అత్యధికంగా దాదాపు 500 మంది ఔట్ పేషెంట్ రోగులకు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ 25 మందికి మోకాళ్లు, ఇతర ఆర్దోపెడిక్ సమస్యలకు ఆపరేషన్లు చేస్తున్నారు. మోకాళ్ల ఆపరేషన్‌కు ప్రైవేట్ ఆస్పత్రుల్లో గరిష్టంగా రూ.8 లక్షలు ఖర్చు అయ్యే దానికి ఇక్కడ ఉచితంగా ఆపరేషన్ చేస్తుండడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అత్యంత ప్రతిభావంతులైన ఆర్దోపెడిక్ వైద్యులు దేశ నలు మూలల నుంచి ఇక్కడికి ఉచితంగా సేవలు అందించడానికి రావడం విశేషం.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆస్పత్రిలో ఉచిత సేవలు అందించడం అంటే…. కలియుగ దైవం ఏడుకొండల వాడి సేవలో తరించినట్టుగా భావిస్తున్నారు. బర్డ్స్‌లో ఉచిత సేవలకు దేశ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడడంతో ప్రతినెలా కొంత మందికి చొప్పున ఉచిత సేవలు అందించే వెసలుబాటును కల్పించినట్టు బర్డ్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి చెప్పారు.
ఢిల్లీ ఎయిమ్స్ హెచ్‌వోడీ డాక్టర్ రాజేష్ మల్హోత్రా బర్డ్స్‌లో సేవలందించేందుకు ఉత్సాహం చూపుతున్నారంటే,..ఇక్కడి ఉచిత సేవలకు డిమాండ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఓపీ ఉంటుందని డాక్టర్ రెడ్డెప్పరెడ్డి తెలిపారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో ఆస్పత్రిలో అధునాతన వైద్య సౌకర్యాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తూ, మెరుగైన సేవలు అందిస్తున్నాట్టు ఆయన చెప్పారు. బర్డ్స్ సేవల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే వైద్యం సామాన్యుల పాలిట అందని ద్రాక్షగా తయారైన పరిస్థితుల్లో …అద్భుతమైన వైద్యం ఉచితంగా అందిస్తున్నామనే సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు.