ఏపీ ప్ర‌భుత్వానికి నిరుత్సాహం!

రాజ‌ధాని వ్యాజ్యాల‌పై చాలా రోజుల త‌ర్వాత నేడు విచార‌ణ మొద‌లు కావ‌డంతో అంద‌రిలో ఆస‌క్తి నెల‌కుంది. అయితే అది కాస్త నిరుత్సాహానికి గురి చేసింది. మ‌రీ ముఖ్యంగా ఇక మీద‌ట విచార‌ణ వేగంగా సాగుతుంద‌ని,…

రాజ‌ధాని వ్యాజ్యాల‌పై చాలా రోజుల త‌ర్వాత నేడు విచార‌ణ మొద‌లు కావ‌డంతో అంద‌రిలో ఆస‌క్తి నెల‌కుంది. అయితే అది కాస్త నిరుత్సాహానికి గురి చేసింది. మ‌రీ ముఖ్యంగా ఇక మీద‌ట విచార‌ణ వేగంగా సాగుతుంద‌ని, ఏదో ఒక నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌ని ఆశించిన ఏపీ ప్ర‌భుత్వానికి చివ‌రికి నిరుత్సాహం త‌ప్ప‌లేదు.

రాజధాని వ్యాజ్యాలపై విచార‌ణ మొద‌లు కాగానే, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వాయిదా వేయాలని పిటిషనర్లు, వాళ్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దేశంలో థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు, కేంద్ర ప్ర‌భుత్వ తాజా నివేదిక‌లు, మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభ‌ణ‌కు సంబంధించి సంకేతాల‌ పరిస్థితుల దృష్ట్యా హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదులు త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. వాయిదా నిర్ణయాన్ని కోర్టుకే వదిలేశారు.

ఈ నేప‌థ్యంలో నవంబరు 15కి వాయిదా వేస్తూ సీజే ధర్మాసనం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాజ్యాల‌పై గ‌త మార్చి 26న సీజే నేతృత్వంలో మొద‌టిసారి విచార‌ణ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో మే 3కు వాయిదా వేశారు.  

అప్పుడు క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతి కొన‌సాగుతూ వుండింది. దీంతో న్యాయవాదుల విన‌తి మేరకు నేటికి అంటే ఆగ‌స్టు 23కు వాయిదా వేసింది. ఇవాళ కూడా విచారణ జరిగి మరోసారి వాయిదాకు దారి తీసింది.