అన్స్టాపబుల్ 2 లో నందమూరి బాలకృష్ణతో నారా చంద్రబాబునాయుడు ముఖాముఖి కార్యక్రమం పెద్ద సంచలనం అవుతుందనే ఆశ ‘ఆహా’ఓటీటీ ప్లాట్ఫాం యజమానుల్లో కనిపిస్తోంది. బాలకృష్ణ చేసిన చంద్రబాబునాయుడు ఇంటర్వ్యూ వలన కొత్తగా కనీసం లక్షల సంఖ్యలో సబ్స్క్రిప్షన్లు వస్తాయని ఆశిస్తోంది. వారు కట్ చేసిన టీజర్ చూస్తే చాలు ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టి రామారావును చంద్రబాబునాయుడు పొడిచిన వెన్నుపోటు ఎపిసోడ్ గురించి ఈ ఇంటర్వ్యూలో చాలా రహస్యాలు వెల్లడించినట్టుగా ఆసక్తి పుట్టేలా టీజర్ ఉంది. దానికి తోడు వైఎస్ తో స్నేహం గురించి కూడా మసాలా జత చేశారు.
అయితే ఇవేమీ కొత్త సంగతులు కాదు. వైఎస్ఆర్ తనకు మంచి స్నేహితుడని చంద్రబాబు గతంలో కూడా పలుమార్లు చెప్పారు. అలాగే కొన్ని కీలకమైన ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ ను పొడిచిన వెన్నుపోటు గురించి కూడా తాను చెప్పదలచుకున్న విషయాలను, చెప్పదలచుకున్న రీతిలో చంద్రబాబునాయుడు గతంలోనూ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు బాలయ్యను కూడా ఆ వెన్నుపోటు ఎపిసోడ్ లో ఇన్వాల్వ్ చేయడం తప్ప.. కొత్తగా చెప్పేదేముందో తెలియదు.
కాకపోతే.. ఆహా వారి ఇంటర్వ్యూ గురించి.. చంద్రబాబునాయుడు తానే ప్రమోషన్ వర్క్ చేసుకుంటున్నారు. అంటే చూడబోతే.. వెన్నుపోటు ఎపిసోడ్ కూడా.. తన ప్రతిష్ఠను పెంచేలా.. తన ఇమేజిని పెంచేలా.. ఆయన బాలయ్య ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం ఇన్చార్జిలు, ముఖ్య నాయకులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో.. ప్రత్యేకంగా ఆహా ఇంటర్వ్యూ గురించి చెప్పుకొచ్చారు.
‘వెన్నుపోటు ఎపిసోడ్’ను బాబు, అధికార మార్పిడి గా వ్యవహరిస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. అన్ స్టాపబుల్ షోలో.. దశాబ్దాలుగా నా మీద బురద వేస్తున్న ఈ అంశంపై బహిరంగంగా పలు విషయాలు చెప్పాను.. అని చంద్రబాబు పార్టీ వారితో చెప్పారు. తద్వారా.. పార్టీ నాయకులందరూ ఆ షోలోని ఇంటర్వ్యూ చూసి తరించాలని, అందులోని వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంకేతాలు ఇచ్చారు.
చంద్రబాబు స్వయంగా ఇంత హైప్ ఇచ్చిన తర్వాత.. ఆహా వారికి కొత్తగా ఈ ఇంటర్వ్యూ కోసం లక్షలో సబ్స్క్రయిబర్లు వస్తారనేది అంచనా. తన బావమరిది, వియ్యంకుడు చేస్తున్న షో కు క్రేజ్ రావడం కోసం చంద్రబాబు ఈ ప్రమోషన్ వర్క్ చేసినట్టుంది. నిజానికి గతంలో ఏబీఎన్ ఆర్కే షో లాంటి అనేక సందర్భాల్లో చంద్రబాబు వెన్నుపోటు గురించి చెప్పారు.
ఆ సందర్భంలో కెమెరాలు ఆన్ లో ఉన్నాయని తెలియక ఎన్టీఆర్ గురించి ఆర్కే, చంద్రబాబు లేకిగా మాట్లాడిన మాటలు కూడా లీక్ అయి, బాహ్యప్రపంచంలోకి వచ్చాయి. ఆహా షోలో ఇంటర్వ్యూ చేస్తున్నది బాలయ్య గనుక.. అప్పటి వెన్నుపోటులో బాలయ్య పాత్రను కూడా వివరించి.. ‘మీకు తెలుసు కదా’ అంటూ ఆయనను కూడా ఇన్వాల్వ్ చేసి.. వెన్నుపోటుకు పవిత్రత ఆపాదించడమూ, ఆహాకు మార్కెటింగ్ చేయడమూ తప్ప చంద్రబాబు సాధించేదేమీ ఉండదు.