సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా వైసీపీ, టీడీపీ అధినేతలు కసరత్తు మొదలు పెట్టారు. పలు సంస్థలతో సర్వేలు చేయిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఇందులో భాగంగా తమకు బాగా అనుకూలం ఉందన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. అయితే అభ్యర్థులను ప్రకటించడంలో వైఎస్ జగన్, చంద్రబాబు వ్యవహార శైలి భిన్నంగా వుంటున్నాయి.
వైఎస్ జగన్ మొహమాటం లేకుండా నేరుగానే చెప్పేస్తున్నారు. జగన్ మాటలు కొందరికి రుచించకపోయినా నోరు మెదపలేని పరిస్థితి. చంద్రబాబు విషయానికి వస్తే… నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారు. కొందరి విషయంలో తనకు తానుగా చెప్పకుండా, పొమ్మన కుండా పొగ పెట్టేలా వ్యూహ రచన చేశారు. ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం.
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, కొందరికి ఇప్పటికే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉదాహరణకు చంద్రబాబు సొంత జిల్లా తీసుకుందాం. చంద్రగిరిలో పులివర్తి నాని, నగరిలో గాలి భానుప్రకాశ్, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌లకు బాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని వారికి దిశానిర్దేశం చేశారు. అదే జిల్లాలో తిరుపతి విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాకు వెళితే డోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డి పేరు ప్రకటించారు. అలాగే కడపలో ఉమాదేవి, జమ్మలమడుగులో భూపేష్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆళ్లగడ్డలో మాత్రం భూమా అఖిలప్రియకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అభ్యర్థి మార్పుపై సీరియస్‌గా కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు టికెట్ ఇవ్వొద్దని నిర్ణయించుకున్న వారి విషయంలో, ఎటూ తేల్చి చెప్పకుండా మౌనం పాటిస్తున్నారు. కేవలం పార్టీని బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. టికెట్ ఇవ్వరనేందుకు బాబు మౌనాన్ని సంకేతంగా తీసుకోవాలని పార్టీ నేతలు చెబుతున్నారు.