సోషల్ మీడియాలో తన పై సెక్సువల్ హెరాస్మెంట్ సాగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నటి స్వర భాస్కర్. వివిధ సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో స్పందించే తత్వం ఉన్న నటి స్వర. ఇండస్ట్రీలో జరిగే చర్చల మీద అయినా, సామాజిక అంశాల మీద అయినా ఆమె డేర్ గా స్పందిస్తూ ఉంటుంది.
తన అభిప్రాయాలను చెబుతూ ఉంటుంది. దీంతో ఇలాంటి వారు కొన్ని పార్టీల వారికి, కొన్ని రాజకీయ భావజాలాలు ఉన్న వారికి టార్గెట్ అవుతుంటారు. తమతో రాజకీయంగా విబేధిస్తూ పోస్టులు పెట్టే సెలబ్రిటీలను వివిధ రకాలుగా టార్గెట్ గా చేసుకోవడం కొందరు నెటిజన్లకు అలవాటే. ఇప్పుడు స్వరను కూడా అలాగే టార్గెట్ చేసినట్టుగా ఉన్నారు కొంతమంది.
అందు కోసం వారు వీర్ ది వెడ్డింగ్ సినిమాలో స్వర చేసిన ఒక సీన్ ను ఆయుధంగా మలుచుకున్నారట. ఆ సినిమాలో ఈమె ఒక స్వయంతృప్తి సీన్ లో నటించిందట. అది నటన. అది సినిమా వరకే. అయితే ఈమె అంటే పడని నెటిజన్లు దాన్ని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చేశారు.
స్వర పెట్టే ప్రతి పోస్టు కామెంట్లలోనూ వారు ఆ సీన్ ను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రస్తావిస్తున్నారట. అలాంటి సీన్లో నటించావ్ కదా.. అన్నట్టుగా కొందరు, అదే ప్రస్తావన తీసుకొచ్చి మరికొందరు స్వర పోస్టులపై స్పందిస్తున్నారట. ఆమె ఏ తరహా పోస్టులు పెట్టినా.. కొందరు మాత్రం వీర్ ది వెడ్డింగ్ సినిమాలోని సీన్ నే ప్రస్తావిస్తున్నారట. ఈ విధంగా ఆమెను లక్ష్యంగా చేసుకుంటున్నారట. ఇదే విషయాన్ని చెప్పుకుని బాధపడుతోంది స్వర భాస్కర్.
ఇది ఒక రకంగా ఆన్ లైన్ సెక్సువల్ హెరాస్మెంట్ అంటూ ఆమె అంటోంది. సినిమా వాళ్లు రకరకాల సినిమాల్లో రకరకాల సీన్లను చేయాల్సి ఉంటుంది. వాటన్నింటినీ వారికి వ్యక్తిగా ఆపాదించడం మొదలు పెడితే సెలబ్రిటీలందరూ టార్గెట్ అవుతారు. అయితే సదరు సెలబ్రిటీలంటే నచ్చని నెటిజన్లు కూడా సినిమాల్లోని వారి పాత్రలను ప్రస్తావించడం అంతగా జరగదు. అయితే ఒక మహిళ- స్వయంతృప్తి సీన్లో నటించే సరికి మాత్రం ఆమె అంటే పడని వారికి ఇదొక కొబ్బరి చిప్పలా దొరికినట్టుగా ఉంది!