బాబి దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమాకు సంబంధించి నిన్న అధికారిక ప్రకటన వచ్చింది. ఆ సందర్భంగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో మాస్ లుక్ లో చిరంజీవి అదరగొట్టారు. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ, కొంతమంది మాత్రం అది చిరంజీవి ఒరిజినల్ ఫొటో కాదన్నారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. లాంగ్ షాట్ లో వెనక నుంచి చిరంజీవి నిల్చున్న ఆ ఫొటోను క్రియేట్ చేశారని కొందరన్నారు. మరికొందరు మాత్రం అది చిరంజీవి ఒరిజినల్ ఫొటోనే అంటూ వాదించారు. ఈ మొత్తం ఎపిసోడ్ కు దర్శకుడు బాబి బ్రేక్ వేశాడు.
చిరంజీవిపై ప్రత్యేకంగా ఫొటో షూట్ చేశామన్నాడు ఈ దర్శకుడు. ఫొటోషూట్ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు.
“చిరంజీవి 154వ సినిమా పోస్టర్ కోసం ఫొటో షూట్ ప్లాన్ చేశాం. చిరంజీవి గారు ఉదయం 5కి లేచి జిమ్ కు వెళ్లి, అట్నుంచి అటు గాడ్ ఫాదర్ షూటింగ్ చేసి, అక్కడ్నుంచి అలసిపోయి మా లొకేషన్ కు వచ్చి ఫొటో సెషన్ లో పాల్గొన్నారు. ఆయన కష్టం చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఊరికే మెగాస్టార్లు అవ్వరు. కుర్ర హీరోలు కూడా అలసిపోతారు. అలాంటిది చిరంజీవి ఇలా వచ్చి, అలా లుంగీ కట్టి అలసట కనిపించకుండా పోజులిస్తుంటే అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి.”
ఇలా పోస్టర్ వెనక జరిగిన మేటర్ ను బయటపెట్టాడు బాబి. ఓ మెగా అభిమానిగా చిరంజీవిని ఎలా చూడాలని 20 ఏళ్లుగా కలలు కంటున్నానో.. తన సినిమాలో చిరును అలా చూపిస్తానంటున్నాడు. ఠాగూర్ నుంచి ఇప్పటివరకు చిరంజీవిని ఎన్నో రకాలుగా ప్రేక్షకులు చూశారని, కానీ లుంగీ కట్టి, ఈల వేసే వింటేజ్ చిరంజీవిని మాత్రం ఎవ్వరూ చూపించలేదని, ఆ పని తను చేస్తానని అంటున్నాడు.