తెలుగు పత్రికా రంగంలో తమను తాము తిరుగులేని నెంబర్ వన్ పత్రికగా చెప్పుకునే ఈనాడు ఇవాళ ఒక అత్యద్భుతమైన పరిశోధనాత్మక వార్తను ప్రచురించింది. విశాఖలో జరుగుతున్న భూ దందాకు సంబంధించి, అక్కడి స్థానిక ఎంవివి సత్యనారాయణ భూలావాదేవీలపై హాట్ హాట్ వార్తా కథనం అది. 10.57 ఎకరాల కూర్మన్నపాలెం స్థలంలో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుని.. స్థల యజమానికి 0.96 శాతం వాటాయిస్తూ 99.04 శాతం బిల్డర్ కు దక్కేలా చేసుకున్న ఒప్పందం గురించిన కథనాన్ని.. తమకు చేతనైనంత వెటకారము, వ్యంగ్యాత్మక వ్యాఖ్యలను జోడించి ఈనాడు ప్రచురించింది.
ఈ భూదందా వ్యవహారం ఎన్నడో జరిగిందని, ఇప్పుడు బయటకు వచ్చిందని దానిమీద తాము పరిశోధించి వివరాలు అందిస్తున్నట్లుగా ఒక బిల్డప్ ఇచ్చింది. మొన్నటి విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్‌లో ఈ లావాదేవీ గురించి ప్రస్తావించి ఉండడంతో.. ‘‘విజయసాయి సౌజన్యంతో’’ అని ఈ కథనంలో ఒక ఉప శీర్షిక కూడా పెట్టింది. అయితే ఈనాడు ప్రధానంగా ఒక్క అంశాన్ని చాలా తెలివిగా విస్మరించింది.
ఈ దందా ‘గ్రేట్ ఆంధ్ర’ చేసిన స్కోర్
యజమానికి 0.96 శాతం వాటా ఇస్తూ బిల్డర్‌కి 99 శాతం వాటా దక్కేలా కుదుర్చుకున్న అక్రమ భూదందా అగ్రిమెంట్ గురించి మొట్టమొదటగా పరిశోధనాత్మక కథనం ప్రచురించినది తెలుగు జగతిలో నెంబర్ వన్ వెబ్సైట్ గ్రేట్ ఆంధ్ర. ఈరోజు ఈనాడు ప్రచురించిన కథనంలో ఉండే వెటకారాలు, సర్కాస్టిక్ మాటలు తీసేస్తే ఆ వివరాలన్నీ కూడా గ్రేట్ఆంధ్ర కథనంలో ఉన్నాయి.
ఒక పరిశోధనాత్మక కథనాన్ని తిరుగులేని సాక్ష్యాధారాలు కూడా తమ వద్ద ఉంటే ఏ రకంగా సీరియస్‌గా ప్రజెంట్ చేయాలో అదే రకంగా గ్రేట్ఆంధ్ర అందించింది. నెంబర్ వన్ వెబ్సైట్ గ్రేట్ ఆంధ్రలో కథనం వచ్చిన రెండు రోజుల తర్వాత విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ లో ఆ భూ అక్రమ దందా గురించి ప్రస్తావించారు. అయితే ఆయన కూడా ‘గ్రేట్ఆంధ్ర’ పేరును ప్రస్తావించలేదు.
‘వైజాగ్ ఎంపీ జాక్‌పాట్ కొట్టేశారా?’ అనే శీర్షికతో గ్రేట్ ఆంధ్ర అక్టోబరు 8వ తేదీన ఈ కథనం అందించింది. అక్టోబరు 11వ తేదీన ప్రెస్ మీట్ లో విజయసాయిరెడ్డి ఇదే దందా గురించి ఓ మాట అన్నారు. (గ్రేటాంధ్ర కథనాన్ని ఈ లింక్ లో చూడొచ్చు)
సాధారణంగా పరిశోధనాత్మక వార్తలు ఎక్స్ క్లూజివ్ గా తమ పరిశోధనలోనే కొత్తగా తెలుసుకున్నవి, తేలినవి అయితే పత్రికలు దానికి మొదటి పేజీలో అగ్ర ప్రాధాన్యం ఇస్తాయి. అదే సమయంలో మరొక పత్రిక లేదా మీడియా సంస్థ ఎంగిలి చేసిన పరిశోధనాత్మక వార్త అయితే ఆ వివరాలు ఇవ్వకుండా ఉండవు గానీ.. ప్రాధాన్యాన్ని తగ్గిస్తాయి. దానితోపాటుగా ఇటీవల దీనిపై ఒక పత్రికలో కథనం వచ్చింది.. ఒక మీడియా సంస్థలో కథనం వచ్చింది.. అంటూ ఒక లైను రాయడం ద్వారా అది తమ సొంత పరిశోధన ఎక్స్క్లూజివ్ కాదు అని సంకేతం ఇచ్చి.. సంస్కారం చూపిస్తాయి.
ఈనాడు దినపత్రికకు ‘గ్రేట్ఆంధ్ర’లో ఈ విషయంపై పరిశోధనాత్మక కథనం వచ్చింది అనే వాక్యాలు రాయడానికి మనసొప్పకపోయినా, ఈగో అడ్డువచ్చి ఉన్నా సరే.. కనీసం ‘ఇటీవల ఓ వెబ్సైట్లో కథనం వచ్చింది’ అని రాసి ఉంటే మర్యాదగా ఉండేది. ఇదేమీ లేకుండా అంతా తమ పరిశోధన అయినట్లుగా కథనాన్ని వండి వార్చేయడం చిత్రం.
తెలుగునాట తాము నెంబర్ వన్ దినపత్రిక అని చెప్పుకునే ఈనాడు.. ఇంటర్నెట్ రంగంలో ఆ హోదాను గ్రేట్ ఆంధ్ర ప్రభంజనానికి ఎన్నడో కోల్పోయింది. ఇంటర్నెట్ రంగంలో ఈనాడు ర్యాంకును అధిగమించి ‘గ్రేట్ ఆంధ్ర’ పైపైకి ఎగబాకడం చాలా నెలల కిందటే జరిగింది. ఇప్పటికీ కూడా గ్రేట్ ఆంధ్ర నెంబర్ వన్ తెలుగు వెబ్సైట్ గా అగ్రపథంలోనే కొనసాగుతూ ఉంది. అలాంటిది తమ నెంబర్ వన్ పోటీదారు ఇచ్చే కథనాలను కూడా తాము గమనించడం లేదు అని బుకాయిస్తున్నట్లుగా.. గ్రేట్ ఆంధ్ర కొన్ని రోజులు ముందుగానే అందించిన పరిశోధనాత్మక కథనం ను కాపీ కొట్టి అంతా తమ సొంత పరిశోధన, తమ రెక్కల కష్టం లాగా డప్పు కొట్టుకోవడం ఈనాడుకు మాత్రమే చెల్లింది.
ఈనాడు దాచి పెడితే సత్యం దాగి ఉండే, మరుగున పడిపోయే రోజులు.. ఇప్పుడు మారిపోయాయి. ఈనాడు కొన్ని సత్యాలను దాచి ఉంచదలచుకున్నా, వాటి గల్లా పట్టుకుని బయటకు తీసుకువచ్చి ప్రజలకు నివేదించడానికి ‘గ్రేట్ ఆంధ్ర’ వంటి సాధికారిక వెబ్ సైట్లు కూడా పుట్టుకు వచ్చాయి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లుగా తమంతగా తాము చెలరేగిపోతాం అని ఈనాడు అనుకుంటే ఇక ఎల్లకాలమూ కుదరదు.