అధికారం చేతిలో వుంటే చిత్రాతిచిత్రాలు జరుగుతుంటాయి. ఏడాది పాటు కోట్ల రూపాయలు అప్పు ఇచ్చి, అర్థరూపాయి వడ్డీ చాలు అని తీసుకునే వాళ్లు వుంటారు. ఎకరా కోటి రూపాయలు వుంటే వెయ్యి రూపాయలు చాలు అంటూ ఇచ్చేసే వారు వుంటారు. అంతే అదో చిత్రం. అదెలా అని అడగకూడదు. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం చూస్తుంటే విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా ఇలాంటి జాక్ పాట్ కొట్టేసారని తెలుస్తోంది.
విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ టాప్ బిల్డర్ అని అందరికీ తెలిసిందే. సినిమాల్లోకి, రాజకీయాల్లోకి రాకముందే ఆయన పెద్ద బిల్డర్. రాజకీయాల్లోకి వచ్చిన కారణం కూడా బిల్డర్ గా వున్నపుడు ఆయనకు, తెలుగుదేశం నేత కళా వెంకటరావుకు మధ్య వచ్చిన ఓ తగాదా. అప్పట్లో కళా వెంకటరావు బంధువులు ఎంవివి మీద కేసు పెట్టి అరెస్టు వరకు తీసుకెళ్లడంతో, కసిగా, పట్టుదలగా పని చేసి ఎంపీ అయ్యారు. ఇదంతా నేపథ్యం.
ఇదిలా వుంటే ఇప్పుడు ఎంవివి చేసుకున్న ఒప్పందం ఒకటి బయటకు వచ్చింది. కూర్మన్మ పాలెం ప్రాంతంలో ఎనిమిది ఎకరాల 95 సెంట్ల భూమిని ఎంవివి సత్యనారాయణ డెవలప్ మెంట్ కు తీసుకున్నారు. ఈ భూమి విశాఖ దొండపర్తికి చెందిన కొందరు ఆసాములది. వారంతా కలిసి 2018 జనవరిలో ఎంవివి సత్యనారాయణ కు డెవలప్ మెంట్ అగ్రిమెంట్ చేసారు.
సాధారణంగా డెవలప్ మెంట్ అగ్రిమెంట్లు 40-60 నుంచి 30-70 ఇలా రకరకాల రేషియోలో వుంటాయి. బిల్డర్ కు తక్కువ ఆస్తి స్వంత దారుకు ఎక్కువ లేదా బిల్డర్ కు ఎక్కువ- స్వంత దారుకు తక్కువ ఇలా రకరకాలుగా వుంటుంది. కానీ ఎంత కాదన్నా ఆస్తి దారుకు ఎంతో కొంత సంతృప్తికరంగా రిటర్న్ వుంటుంది.
కానీ ఎంవివి చేసుకున్న ఒప్పందం చిత్రంగా వుందనే సమాచారం అందుతోంది. దాదాపు 51.158 గజాల్లో 490 గజాలు స్వంత దారులు వుంచుకుంటారు. మిగిలిన 50,668 గజాలను డెవలప్ చేస్తారు. ఇందులో 15 లక్షల చదరపు అడుగుల మేరకు నిర్మాణాలు చేస్తారు. ఇందులో ఆస్తి స్వంత దారులకు జస్ట్ 14,600 చదరపు అడుగులు మాత్రం ఇస్తారు. నిర్మాణం అంతా ఎంవివి దే.
ఇదే ఆశ్చర్యకరమైన పాయింట్ గా చెబుతున్నారు. పదిహేను లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేస్తే హీనంలో హీనం నాలుగున్నర లక్షల చదరపు అడుగుల మేరకు అంటే 30 శాతం ఆస్తి స్వంత దారులకు ఇవ్వాల్సి వుంటుంది. కానీ అలాంటిది జస్ట్ వన్ పర్సంట్ ఇవ్వడం ఏమిటో? అన్నది తెలియాల్సి వుంది. విశ్వసనీయ వర్గాలు అందంచిన సమాచారం మాత్రం వన్ పర్సంట్ కే ఆస్తి స్వంతదారులు అంగీకరించినట్లు వుంది.
ఇదే చిత్రంగా వుంది. దీని గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. తెలిసిన వివరాలు మాత్రం చూస్తుంటే ఇంత కారు చౌకగా, దాదాపు ఫ్రీగా స్థలాన్ని ఎవరైనా డెవలప్ మెంట్ కు ఇచ్చేస్తారా? దీని వెనుక వైనం ఏమై వుంటుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి.