ప్రజారాజ్యం పార్టీ విషయంలో మెగాస్టార్ చిరంజీవి మీద ఒక అపవాదు వుంది. పార్టీని అమ్మేసుకున్నారని, అంతకు ముందు టికెట్ లు అమ్ముకున్నారని విమర్శలు వున్నాయి. కానీ తొలిసారి గా చిరంజీవినే ప్రజారాజ్యం పార్టీ కోసం విలువైన ఆస్తి అమ్ముకున్నారని వెల్లడించారు నిర్మాత ఎన్వీ ప్రసాద్.
గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో ఎన్వీ ప్రసాద్ కాస్త ఆవేశంగానే ప్రసంగించారు. నిజానికి ఈ సభతో సంబంధం లేకపోయినా ప్రజారాజ్యం ప్రస్తావన తెచ్చారు.
అందరూ ఆయనేదో పార్టీని అమ్మేసుకున్నారని అంటారని, ఎవ్వరికీ ఇప్పటి వరకు తెలియని విషయం చెబుతున్నా అంటూ, చెన్నయ్ ప్రసాద్ ల్యాబ్ సమీపంలోని అత్యంత విలువైన స్థలాన్ని పార్టీ నడపడానికి చేసిన అప్పుల కోసం చిరు అమ్మేసిన వైనాన్ని ఎన్వీ ప్రసాద్ వెల్లడించారు. ప్రజారాజ్యం విషయంలో జరిగిన పొరపాట్లకు సమాధానమే జనసేన పార్టీ అని ఎన్వీ ప్రసాద్ అనడం విశేషం.
అంతే కాదు, ఇకనైనా చిరంజీవి మొహమాటలు వదులుకోవాలని, కొందరిని వదులుకోవాలని ఎన్వీ ప్రసాద్ అనడం విశేషం. ఆ మొహమాటాలు ఎవరితో, ఎవరిని వదులుకోవాలన్నది మరి ఆ ఇద్దరికే తెలియాలి. మొత్తం మీద రాను రాను వ్యవహారం చూస్తుంటే మెగాస్టార్ మెలమెల్లగా జనసేనకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది.