2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించి తాను, తాను మద్దతు ఇచ్చే పార్టీలు అధికారంలోకి రావాలని కలగంటున్న పవన్ కళ్యాణ్ ఎదుట ప్రస్తుతం ఒక అద్భుతమైన అవకాశం ఉంది.
2019 ఎన్నికలలో అత్యంత దారుణంగా పరాజయం పాలైనప్పటికీ.. ఆ తర్వాతి కాలంలో తన పట్ల ప్రజలలో నమ్మకం, ఆదరణ విపరీతంగా పెరిగాయని.. 2024లో అధికారంలోకి రావడం తథ్యం అని పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నారు!
అయితే ఆయన తలపోస్తున్నట్లుగా నిజంగానే ఆదరణ పెరిగిందా? లేదా? చెక్ చేసుకోవడానికి… వందిమాగధులు చెప్పే మాటల మీద ఆధారపడకుండా వాస్తవాలు తెలుసుకోవడానికి ఆయన ముందు అద్భుతమైన అవకాశం ఉంది. అయితే ఈ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ ఏ మేరకు వాడుకోగలరో.. అవకాశాన్ని వాడుకోగల స్వేచ్ఛ బిజెపితో పొత్తులలో ఉన్న ఆయనకు ఉంటుందో లేదో మనకు తెలియదు. ఇంతకూ ఆ అవకాశం ఏమిటి?
వచ్చే ఏడాది ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా పట్టభద్ర ఉపాధ్యాయ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు. వీటిలో ప్రకాశం, కడప టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు కాగా.. ప్రకాశం, కడప, శ్రీకాకుళం పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలు. అంటే రాష్ట్రంలో ఇటు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలలోనూ ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నమాట.
అంటే ఈ ఎన్నికల్లో వచ్చే తీర్పు ఇంచుమించుగా ఈ మూడు ప్రాంతాల ప్రజల మనోభిప్రాయాలను ప్రతిబింబిస్తుందని అనుకోవాలి. ఇలాంటి ఎన్నికలు సద్వినియోగం చేసుకోవాలని.. జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది నిజంగానే ప్రజల్లో ఉంటే గనుక, దాన్ని బయటపెట్టాలని.. ఏ రాజకీయ పార్టీ అయినా కోరుకోవడం సహజం! అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ అందుకు సిద్ధంగానే ఉన్నారా లేదా తెలియదు.
వచ్చే ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఆల్రెడీ ప్రకటించారు. ఏపీలో ఒక పార్టీతో తమకు పొత్తు ఉన్నదని, ఆ పార్టీ తమకంటే బలమైనదని, గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి తమకంటే కనీసం ఆరు శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని ,ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేసేస్తుందని ఏకపక్షంగా ప్రకటించే ముందు ఏపీలో తమకంటే బలమైన ఆ పార్టీతో సంప్రదించాలని.. సోము వీర్రాజుకు ఆలోచన ఉన్నదో లేదో కూడా మనకు అర్థం కావడం లేదు.
ఎందుకంటే ఐదు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా జనసేనతో ఏమాత్రం సంప్రదించకుండానే ఎన్నికల్లో పోటీ చేస్తామని వీర్రాజు చెప్పడం ఆశ్చర్యకరం. సోము సంగతి వదిలేస్తే పవన్ కళ్యాణ్ సంగతి ఏమిటి? ఈ ఎన్నికలలో రంగంలోకి దిగడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారా అనేది ఆలోచించాలి.
పవన్ కళ్యాణ్ చెబుతున్నట్లుగా ఆయనకు జనాదరణ పెరుగుతున్న మాట వాస్తవమే అయితే అవి ప్రధానంగా యువతలోను చదువరులలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి ఎన్నికలలో ఓటర్లను డబ్బుతోను, లిక్కర్ సీసాలతోనూ కొనుగోలు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ చెప్పే ఆదర్శ రాజకీయ భావజాలం ఈ చదువరుల సెక్షన్ లో కొంతవరకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కనుక పవన్ కళ్యాణ్ సక్రమంగా ఈ ఎన్నికలను వినియోగించుకుంటే చట్టసభలలో తన గళాన్ని వినిపించడానికి ఒక అవకాశం దొరుకుతుంది.
అయితే ఇప్పటికే ఈ ఎన్నికలలో బిజెపి పోటీ చేయబోతున్నట్లుగా సోము వీర్రాజు చెప్పేశారు. తెలుగుదేశం పార్టీ ఎటు తిరిగీ పోటీలో ఉండనే ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే లోగా తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకునే అవకాశం తక్కువ. ఇలాంటి నేపథ్యంలో బిజెపిని ఒప్పించి తన పార్టీ కోసం కొన్ని సీట్లను పవన్ కళ్యాణ్ పుచ్చుకోగలరా? ఆయనకు సాధ్యమవుతుందా? అనేది ఒక ప్రశ్న!
ఆ తర్వాత.. తెలుగుదేశం పార్టీ అవకాశాలకు గండి పడుతుందనే భయం లేకుండా పవన్ కళ్యాణ్ తన పార్టీని చురుకుగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముందుకు తీసుకు వెళ్ళగలరా? యువతలోనూ చదువరుల సెక్షన్‌లోనూ తనకే ఆదరణ ఎక్కువగా ఉంటుంది అని నిరూపించుకోవడానికి ఆయన సిద్ధమేనా? అనేది రెండో ప్రశ్న.
ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ స్వయంగా కాస్త తీరిక చేసుకుని రాజకీయ వ్యవహారాలపై దృష్టి సారించాలి. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ షెడ్యూల్ లో గ్యాప్ వస్తే తప్ప అది సాధ్యం కాకపోవచ్చు!