నగరి ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ అభ్యర్థిని చంద్రబాబు ఖరారు చేశారు. నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తిరిగి టికెట్లు ఇస్తున్నట్టు ఆయన ఇటీవల ప్రకటించారు. ఓడిపోయిన చోట ఆయన ఆచితూచి అడుగులేస్తున్నారు.
సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్టు తెలిసిందే. అయితే కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులెవరూ చంద్రబాబుకు దొరకడం లేదు. ఇది ఒకింత టీడీపీకి సమస్యగా మారింది. ఓడిపోతారని తెలిసి కూడా అభ్యర్థుల విషయమై అఇష్టంగానే నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని చంద్రబాబు వాపోతున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో తనను, కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులను ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. వారిపై బలమైన అభ్యర్థులను నిలిపేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మంత్రి రోజాపై గాలి భానుప్రకాశ్‌నే మరోసారి నిలిపేందుకు చంద్రబాబు నిర్ణయించారు. దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడే భానుప్రకాశ్.
గత సార్వత్రిక ఎన్నికల్లో రోజాపై పోటీ చేసి, తృటిలో విజయాన్ని చేజార్చుకున్నారు. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని గాలి భానుప్రకాశ్‌కు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రోజాపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత తదితర అంశాలు టీడీపీ విజయానికి దోహదం చేస్తాయనే చర్చ నడుస్తోంది. తనపై ప్రతికూల పరిస్థితుల్ని రోజా ఎలా అధిగమిస్తారో చూడాలి.