తూర్పు ఎపుడూ ఆశావహంగా ఉంటుంది. సూర్యుడు ఉదయించేది ఆ దిక్కునే. అందుకే తూర్పు కోసం ఎవరైనా ఎదురుచూపులు చూస్తారు. చాలా కాలానికి విశాఖ వస్తున్న జనసేన అధినేత గాజువాక వెళ్ళడంలేదు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రొగ్రాం పెట్టుకున్నారు. కౌలు రైతులకు భరోసా కార్యక్రమాన్ని ఆయన తూర్పు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు.
విశాఖ తూర్పు టీడీపీకి కంచుకోటగా ఉంది. మూడు సార్లు ఆ పార్టీ గెలిచింది. ఇక వైసీపీ కూడా ఇక్కడ గట్టిగా ఉంది. జనసేన 2019 ఎన్నికల్లో పోటీ చేసింది కానీ అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదు. అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఇక్కడ గట్టిగానే నిలబడింది. ఓట్లు కూడా టీడీపీతో పోటీ పడి మరీ వచ్చాయి.
దాంతో ఈసారి తూర్పు మీద జనసేనాని దృష్టి పెట్టారు అని అంటున్నారు. ఈసారి తూర్పు నుంచి జనసేన అభ్యర్ధిని పోటీ పెడతారా లేక తానే నిలబడతారా అన్న దాని మీద పార్టీలో కూడా ఆలోచనలు సాగుతున్నాయట. ఈసారి విశాఖ హార్ట్ ఆఫ్ ది పార్ట్ లోనే జనసేనాని నిలబడతారు అని అంటున్నారు.
విశాఖ ఉత్తరం, తూర్పు నియోజకవర్గాలు అందులో ఉన్నాయని అంటున్నారు. బీసీలు ఎక్కువగా ఉండే తూర్పులో పవన్ పోటీ చేసి సామాజిక సమీకరణలను సరిచేస్తారని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే విశాఖ మీద పవన్ మనసు అలాగే ఉందని, ఆయన పోటీ ఇక్కడ నుంచే ఖాయమని జనసేన వర్గాలు అంటున్నాయి.