దేశ రాజధాని ఢిల్లీలో ఒకానొక దశలో రికార్డు స్థాయి కరోనా కేసులు నమోదయ్యాయి. సెకెండ్ వేవ్ పతాక స్థితిలో ఉన్నప్పుడు ఢిల్లీలో నమోదైన యాక్టివ్ కేసుల సంఖ్య అక్షరాలా లక్షకు పైనే! రోజువారీ కేసుల సంఖ్య ఇరవై వేలకు పైగా నమోదైన ఆ దశలో లక్షకు పైగా యాక్టివ్ కరోనా కేసులు ఉండేవి. ఆ తర్వాత సెకెండ్ వేవ్ పూర్తి తగ్గుముఖం పట్టిన ప్రాంతంగా ఢిల్లీ ముందు వరసలో నిలిచింది.
సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం మొదలైనది ఢిల్లీలోనే. దాదాపు రెండు నెలల నుంచి ఢిల్లీలో కరోనా బాగా నిమ్మళించింది. ఈ క్రమంలో ఇప్పుడు అక్కడ ఆశ్చర్యకరమైన నంబర్లు నమోదవుతూ ఉండటం గమనార్హం.
ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 400లోపు మాత్రమే! గత ఇరవై నాలుగు గంటల్లో నమోదైన కేసులు, డిశ్చార్జిల నేపథ్యంలో.. ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 400లోపుకు చేరింది. అలాగే గత మూడు రోజులుగా అక్కడ కరోనా కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
మూడు రోజుల పాటు కరోనా కారణ మరణాలు ఏవీ నమోదు కాకపోవడం ఊరటను ఇచ్చే అంశమే. ఇలా జీరో కరోనా డెత్ రేటుకు చేరింది ఢిల్లీ. ఒక దశలో ఢిల్లీ జనులకు తప్ప, బయట నుంచి ఢిల్లీ ఆసుపత్రులకు వచ్చే వారికి చికిత్స కూడా అందించలేమని ఢిల్లీ ప్రభుత్వం చేతులెత్తేసింది. అలాంటి చోట ఇప్పుడు కరోనా బెడ్లు అన్నీ ఖాళీ అయ్యాయని ప్రభుత్వం చెబుతోంది.
ఉన్న 400 యాక్టివ్ కేసుల్లో కూడా 129 మంది హోం ఐసొలేషన్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారట. ప్రస్తుతం 242 మంది కరోనా పేషెంట్లు ఆసుపత్రల్లో ఉంటూ చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ ప్రకటన చెబుతోంది. మొత్తం 11 వేలకు పైగా కరోనా పేషెంట్లకు కేటాయించిన బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.
యాక్టివ్ కేసుల సంఖ్య 370 స్థాయిలో ఉంది. ఇదే రీతిన పరిస్థితి కొనసాగితే.. అతి త్వరలోనే ఈ యాక్టివ్ కేసుల సంఖ్య కూడా జీరో స్థాయికి రావొచ్చు. మరో పది రోజుల పాటో, రెండు వారాల పాటో ఇదే పరిస్థితి కొనసాగినా, దేశ రాజధాని కరోనా కేసుల విషయంలో కంప్లీట్ జీరో స్టేటస్ లో నిలవొచ్చు.